Home సంపాదకీయం నవభారత వికాస దార్శనికుడు….

నవభారత వికాస దార్శనికుడు….

(ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)

నవ భారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు, సర్వ సమానత్వానికి కృషిచేసిన కారణజన్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్. పునాదుల నుంచి దేశాన్ని పెకిలిస్తున్న సమస్త చెడులకు కుల వివక్ష మూలమని కుండబద్దలు కొట్టి అసమానతలు లేని స్వేచ్ఛ భారతావని కోసం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు అంబేద్కర్.స్వతంత్ర్య సంగ్రామ నాయకులుగా ముందువరుసలో నిలిచేది కొందరైతే స్వతంత్ర భారత నిర్మాతగా అంబేద్కర్ ది సమున్నత పీఠం. స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం మూలస్తంభాలుగా రాజ్యాంగ మహసౌదా నమూనాను ఆవిష్కరించిన రాజ్యాంగ నిర్మాత,దేశ సమస్యల పట్ల ఖచ్చితమైన దృక్పథంతో ఆచరణాత్మక పరిష్కారాలతో జాతి నడవడికి కొత్త రక్తం ఎక్కించిన మార్గదర్శి బాబాసాహెబ్ అంబేద్కర్ యాదిలో ఒక్కసారి స్మరించుకుందాం..

కుల వివక్షను ఎదుర్కొంటూ..

భారత రాజ్యాంగ నిర్మాత, ప్రజాస్వామ్య పరిరక్షకుడు, సంఘసంస్కర్త అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో మందన్ గాడ్ పట్టణానికి దగ్గరున్న అంబావాడే గ్రామంలో రాంజి సక్ పాల్ ,భీమాబాయి పుణ్య దంపతులకు జన్మించారు. అణగారిన మహర్ వర్గంలో జన్మించి జీవితంలోని ప్రతి దశలోనూ కులపరమైన వివక్ష అనుభవించి అవమానాలు ఎదుర్కొన్న అంబేద్కర్ విదేశీ పాలకుల పైన కన్నా అంతర్గతంగా దేశంలో కొనసాగుతున్న కుల వివక్ష పైన పోరాటం చేశారు. అందరితో పాటు ఎద్దుల బండి ఎక్కడానికి, తరగతి గదులు కూర్చోవడానికి, బావిలో నీళ్లు తోడడానికి, గుడికి వెళ్లడానికి కులాన్ని అడ్డుగా చూపుతున్న అగ్రవర్ణాల ఆధిపత్యానికి తెరదించాలని బాల్యదశ నుండే కంకణం కట్టుకున్నాడు. అనేక అవమానాలు ఎదుర్కొంటూ బరోడా మహారాజు శాయాజీరావు గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల వేతనంతో బి.ఏ డిగ్రీ పూర్తి చేసి 1913లో పై చదువులకు కొలంబియా వెళ్ళాడు. 1915 లో ఎమ్.ఏ,1916 లో పిహెచ్ డి పట్టాను పొందాడు. 1917 లో ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత కుల వివక్ష పై అలుపులేని పోరాటం కొనసాగించాడు.1927లో మహదలో దళిత మహాసభ నిర్వహించి నూతన సామాజిక ఉద్యమ వికాసానికి శ్రీకారం చుట్టాడు.బడుగుల తరఫున అంబేద్కర్ బలమైన వినిపించడంతో1932లో బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్ డోనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటించారు.దాని ప్రకారం అగ్రవర్ణ, నిమ్న,దళిత ,ముస్లిం, సిక్కు, భారతీయ క్రిస్టియన్లు, ఆంగ్లో-ఇండియన్ లకు రాజకీయ ప్రాతినిధ్యం కోసం ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. అణగారిన వర్గాలకు రాజ్యాధికారం లో వాటా కల్పించిన మొట్టమొదటి ఘట్టం అది.కొంతకాలం క్రితం వరకు తన బతుకుల మీద అజమాయిషీ లేని వర్గాలు ఇప్పుడు దేశాన్ని పరిపాలించేందుకు ముందుకు వస్తున్నాయి అంటే అది అంబేద్కర్ దార్శనిక ఫలితమే.ప్రభుత్వ ఉద్యోగుల్లో దళిత ,బహుజనుల రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పిస్తూ అంబేద్కర్ తీసుకున్న నిర్ణయం కుల వివక్షను సంపూర్ణంగా రూపుమాపే వ్యవస్థ నిర్మాణంలో తొలి అడుగు అని చెప్పవచ్చు.

రాజ్యాంగ నిర్మాతగా..

రాజ్యాంగ ముసాయిదా సంఘం లోని ఏడుగురు సభ్యుల్లో ఒకరు చనిపోయారు. మరొకరు అమెరికా వెళ్లిపోయారు. ఇంకొకరు రాష్ట్ర వ్యవహారాల్లో ఎడతెరిపి లేకుండా ఉన్నారు. మరో ఇరువురు సభ్యులు ఆరోగ్య కారణాల రీత్యా ఢిల్లీకి దూరంగా ఉన్నారు. ఇక మిగిలింది ముసాయిదా సంఘం అధ్యక్షుడు అంబేద్కర్ మాత్రమే. రాజ్యాంగ రచన భారమంతా పూర్తిగా ఒక్కరే మోసి అంత ఒత్తిడిలోను అద్భుతమైన రాజ్యాంగాన్ని రూపొందించారు. రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఎంతో పెద్ద రాజ్యాంగం నిర్మించిన అంబేద్కర్ గారు దేశాన్ని పదికాలాలపాటు నిలబెట్టే కీలక అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. మూడవ భాగంలో ప్రాథమిక హక్కులను నాలుగో భాగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచి నూతన హక్కులకు ఆదర్శాలకు తెరతీశారు. మతానికో రకమైన ధర్మ సూత్రాలున్న మన దేశంలో అవే ప్రాతిపదికగా సాగితే జాతి ప్రగతి రథం కుదుపులకు లోనుకావడం ఖాయమని భావించిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలోని 44 అధికరణంలో ఉమ్మడి పౌర స్మృతి చోటుకల్పించారు. రాజ్యాంగ నిర్మాతగా మారి సామాజిక సమానత్వం కోసం ప్రయత్నించారు. “రాజ్యాంగం ఎంత మంచిదైనా కావచ్చు దానిని అమలు పరిచే వారు చెడ్డవారైతే అది చెడు అవుతుంది మంచివారు అయితే అది మంచిదవుతుంది”రాజ్యాంగంలో రూపుదిద్దుకున్న నిబంధనల కన్నా పాలకుల స్వీయ నైతికత దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని అన్నారు.రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో ఎదగడానికి అందరికీ సమాన అవకాశాలు ఉండాలన్న ఆశయంతో రిజర్వేషన్ విధానాన్ని శ్రీకారం చుట్టిన అంబేద్కర్ కలలుగన్న సామాజిక సమానత్వం, కుల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరం పాటుపాడడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి.

అంకం నరేష్
6301650799

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version