పూలే సినిమాకు చిరంజీవి సై అనాలంటున్న తెలంగాణ మేధావి

0
954

” దాదాపుగా ఒకటిన్నర దశాబ్ధం, ఒక పుష్కర కాలం నుంచి ఇది నా మదిలో మెదులుతూ ఉంది. దానికంటే ముందు, 20 సం.లకు ముందు మీరు చేయాలనుకుంటున్న అధ్భుతమైన పాత్రలేమైనా ఉన్నాయా ? అంటే ఎపుడు అంటాను. నాకు స్వాతంత్ర సమర యోధుడి పాత్రని చేయాలి. అది నా జీవితంలో నిలిచిపోయే పాత్ర అవ్వాలి. ఆ విధంగా ప్రజల్లో నిలిచిపోయే పాత్ర అవ్వాలి. నా కెరీర్‌ కి అది బెస్ట్ పాత్ర అవ్వాలి. అలాంటి పాత్ర చేయాలి. అది భగత్ సింగ్ లాంటి వారి జీవిత చరిత్రలకు సంబంధించిందెై ఉండాలి అంటూ నేనూ చెపుతూ వచ్చేవాడిని. కానీ నా ముందుకు ఏ కథకుడు తీసుకురాలేదు. ఏ నిర్మాత తీసుకురాలేదు. ఏ దర్శకుడు తీసుకురాలేదు. ఇక ఆ కల అలాగే ఉండిపోయింది. కాని ఆ తర్వాత పుష్కరకాలం ముందు పరుచూరి వెంకటేశ్వర్ రావు గారు, పరుచూరి బ్రదర్స్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని ఒక పాలెగారు ఉన్నారు. కర్నూల్‌ చుట్టుపక్కల ప్రాంతాలకి చెందిన వ్యక్తి. ఆ పాత్ర మీకు చాలా నప్పుతుంది. అందులో ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయి. ఒక చక్కని పరిపూర్ణమైన సినిమాకి సరిపోయే కథ. ఇది సినిమాగా ఎంతవరకు సక్సెస్ అయితామనే విషయం పక్కకి పెడితే.., ఒక యోధుడు, స్వాతంత్ర సమరయోధుడు గురించి అందరికి తెలియాల్సిన అవసరం ఉంది అని పరుచూరి బ్రదర్స్ చెపితే ఒక అన్ టోల్డ్ స్టోరీ , అన్ సంగ్ హీరో గురించి అందరికి తెలియచేయాలి అని నేను అనుకున్నాను.
అయితే ఈ కథ తెరకెక్కిoచి న్యాయం చేయాలంటే బడ్జెట్ కష్టం. ఏ నిర్మాత ముందుకు రాలేదు. ఏ నిర్మాతని అడగలేం అని ఆగిపోయిన దశలో …, చరణ్ (రాంచరణ్ తేజ్ ) ముందుకు వచ్చి ఇతరులని ఇబ్బంది పెట్టకుండా, నేనే చేస్తా అని ముందుకు రావడంతో ఈ సినిమాని మొదలు పెట్టాల్సి వచ్చింది.
…. …… …. , ”

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి గారి మాటలివి.

ఉయ్యలవాడ నరసింహా రెడ్డి గురించి కాంట్రవర్సీ గా నేను మాట్లాడదలచుకోలేదు. ఆ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఆ ఉత్సాహంతో చిరంజీవి గారు మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఆ సినిమా భారత సాంఘీక విప్లవోద్యమాల పితామహుడు, మహాత్మ జ్యోతిబాపూలే జీవిత చరిత్ర కావాలనుకుంటున్నాను. ఎందుకంటే …,

 1. దశాబ్ధమునర కాలం కింద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి సినిమా అనే ఆలోచనతో చిరంజీవి గారు అనుకుంటే , అది కేవలం తనకి సినిమాకి అభిమానులకి సంబంధించిన విషయం.
  కానీ దశాబ్ధ కాలం కింద చిరంజీవి గారు తెలుగు రాష్ట్రాలకి ఒక అన్ టోల్డ్ స్టోరీని, అన్ సంగ్ హీరోని పరిచయం చేసిండు. అతనొక గొప్ప యోధుడు.ఈ దేశంలోనుండి బ్రిటీష్ వారిని బయటికి పంపించాలనే కృత నిశ్చయంతో 1840 నాటికే ‘దానపట్ట’ ని నేర్చుకోని బ్రిటీష్ వారిని తన్ని తరిమిన వ్యక్తి. తొలి స్వాతంత్ర సమరయోధుడు.కానీ ఆ తర్వాతే వాస్తవాలను గుర్తించి 97% ఉన్న ఈ దేశ మూల వాసులకి అసలు శతృవైన విదేశీయుడైన ఆర్య బ్రాహ్మణులే ఈ దేశంలో అన్ని సమస్యలకి కారణం అని గుర్తించి కేవలం బ్రిటీష్ వారు మాత్రమే వెల్లిపోతే ఈ దేశ సమస్యలు తీరవని 3 వేల ఏండ్లుగా ఈ దేశంలో తిష్టవేసి తమ సిస్టమ్ కాపాడుకోనుటకు విదేశీయులైన అరబ్బులని, మొగల్ లనీ, బ్రిటీష్ వారిని ఆహ్వానించిన ఆర్య బ్రాహ్మణులని కూడా బ్రిటీష్ వారితో సహా బయటకు పంపాలని వారి వురికి ప్రత్యామ్నయంగా ‘ తృతీయ రత్న’ గా ఈ దేశ మూలవాసుల సమున్నత, సంస్కృతి సాంప్రదాయ వారసత్వాలను కాపాడాలనుకున్న మహా జాతీయవాది. గొప్ప దేశ ప్రేమికుడు మహాత్మ జ్యోతి రావు ఫులే. అతని సినిమాని కూడా చిరంజీవి గారు తీయాలని కోరుకుంటున్నాను.
 2. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథ కంటే మించి ఒక సినిమాకి అన్ని రకాల డైమెన్షన్స్ కల కథ మహాత్మ జ్యోతిరావు ఫూలేది. ఫూలే ఒక సంపూర్ణ స్వాతంత్ర సమరయోధుడు, ఈ నేలపై మానవుల కనీసమైన హక్కుల కోసం పోరాడిన వ్యక్తి. ఈ దేశానికి అక్షరాలను దిద్దించినవాడు. దేశంలో తొలి ఉత్తమ ఉపాధ్యాయుడు. ఆడబిడ్డలను చంకనేసుకోని కాపాడినవాడు , కరువొస్తే ప్రజలకు అన్నం పెట్టినవాడు. కేవలం బ్రాహ్మణ కుటుంబాల్లో సంస్కరణనే దేశ సంస్కరణగా చూపిస్తున్న తప్పుడు సమయంలో , దేశంలో బహు (అధిక) జనుల దురాచారాల, మూఢాచారాల నిర్మూలనకై రాజీలేని పోరాటం చేసిన మహానీయుడు. సత్యాగ్రహాన్ని ఒక సాధనంగా మార్చి ఈ దేశంలో రైతుల సమస్యలపై , కార్మికుల సమస్యలపై పోరాడిన రైతు నాయకుడు. దేశంలో తొలి కార్మిక నాయకుడు. దిక్కు మొక్కులేని జనానికి అండగా దైర్యంగా నిలబడి ఆత్మగౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని కల్పించిన గొప్ప మానవతామూర్తి. సర్వజనులకు ప్రత్యామ్నయాన్ని ప్రవచించిన సత్యధర్మ ప్రవక్త.
  కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ దేశం మనది అనే మూలనివాసి (నేటివ్ ఇండియన్స్ ) సిద్ధాంత రూపక ఏకాత్మ భావనని కల్పించిన ఈ దేశ చిత్రపటానికి వెన్నెముక ఫూలే .ఈ దేశంలో నిజమైన ,మొదటి మరియు ఏకైక మహాత్ముడు జ్యోతిరావు పులే.
 3. కాబట్టి పూలే జీవితంలో అధ్భుతమైన డైమెన్షన్స్ కలవు. మామూలు కుటుంబంలో పుట్టుక, గొప్ప స్నేహితులు, ప్రేమ, పోరాటం, థ్రిల్లర్ , హాస్యం అన్ని సమపాళ్ళలో కల జీవితం ఫూలేది. మహాత్మ జ్యోతిరావుపులే , సావిత్రి బాయి ల మధ్య గల అధ్భుతమైన ప్రేమ , ప్రేమలేఖలు , సమాజం పట్ల భాద్యత, భార్యభర్తల సహచర బంధం వీటితో పోల్చగల ప్రేమ బంధం ; భారతీయ కాల్పనిక , చారిత్రక సాహిత్యంలో చరిత్రలో వేరెవరు లేరు. ఈ దేశంలో గొప్ప ఆదర్శనీయ పుణ్య దంపతులు, ఆమర ప్రేమికులు వారిరువురు . ఇటువంటి కథలని వదులుకుని కొంత మాత్రమే చరిత్రకి అందిన విషయాన్ని సాగదీస్తూ అల్లిన కల్పిత కథలని, కైపియత్ లని, పుక్కిటి ముచ్చట్లను చేర్చి ప్రేక్షకులని బలవంతంగా ఒక కల్పనలో కూర్చోబెట్టే బదులు సత్యంతో, సాక్ష్యంతో, ఆధారాలతో కూడిన నిజమైన చరిత్రని ఫూలే సినిమాగా తీయవచ్చు. ఫూలే సినిమా తీస్తే ఈ దేశంలో మల్లీ ఛత్రపతి శివాజీ ఉత్సవాలు ప్రారంభించవచ్చు. గత డెబ్బై ఏండ్లుగా అబద్ధాల మీద, ద్వేషాల మీద, కుట్రల మీద నడుస్తున్న తప్పుడు దేశభక్తి పోయి ఈ నేలని, ఈ మట్టిని, మనుషులని ప్రేమించే నిజమైన ఈ దేశప్రేమికుల జాతీయతా భావం పెంపొందుతది.
 4. అయితే చిరంజీవి గారికే ఎందుకు ముడిపెట్టి చెప్పాల్సి వస్తుంది అంటే 2008 లో తెలుగు రాష్ట్రాలకి ‘ సామాజిక న్యాయం’ అనే భావనని పరిచయం చేస్తూ ఇపుడు మనం మాట్లాడుతున్న ‘ సామాజిక తెలంగాణ ‘ అనే డిమాండ్ ని ముందు పెట్టి మహాత్మ జ్యోతిరావు పూలేని పెద్ద ఎత్తున మనకి పరిచయమయ్యేలా చేసింది చిరంజీవి గారే. అంతే కాకుండా సామాజిక న్యాయం అనే పిలుపునివ్వడమే కాకుండా చట్టసభల్లో రిజర్వేషన్స్ లేని బీసీలకు ముస్లీములకి మహిళలకి వందకి పైగా టికెట్స్ ఇచ్చి కేవలం పిలుపు వరకే పరిమితం కాకుండా ఆచరించి చూపిన వ్యక్తి చిరంజీవి గారు. కాకుంటే రాజకీయాలలో జరిగే కుట్రలని తట్టుకోలేక వెనుకడుగేసిండు. అయితే తను రాజకీయాల కోసం వెలుగులోకి తీసుకువచ్చిన మహాత్మ జ్యోతిరావు పూలేని కేవలం అవసరం కోసం వాడుకోవాలని చూసి వదిలేసిండనే, వెనుకడుగు వేసిండనే అపవాదు లేకుండా తన జీవితంలో తన నిబద్ధతతని నిరూపించుకునే అవకాశం చిరంజీవి గారికి పూలే సినిమాని తీయడం ద్వారా లభిస్తది. పైగా అది అతను చేయగలిగే , తనకి సాధ్యమయ్యే పని . 63 సం.రాలు మాత్రమే బ్రతికిన పూలే జీవితాన్ని సినిమాగా తీస్తే 66 సం.రాల చిరంజీవి గారు అధ్భుతంగా నటించగలరు.
 5. ఇంతవరకు ఏ తెలుగు నటుడికి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం లభించలేదు. ఇపుడున్న హీరోలలో ఆ స్థాయి గల నటులు కూడా ఎవరు లేరు చిరంజీవి గారు తప్ప. బాబాసాహెబ్ అంబేడ్కర్ సినిమాలో నటిస్తే మళయాళి నటుడు మమ్ముట్టి కి ‘ఉత్తమ నటుడు ‘ గా జాతీయ పురస్కారం లభించింది. రేపు ‘ మహాత్మ జ్యోతిరావు పులే ‘ సినిమాలో నటిస్తే కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి ‘ జాతీయ ఉత్తమ నటుడు ‘ ఇవ్వక తప్పని పరిస్థితి వస్తది.
 6. కథ సిద్ధంగా ఉంది. దర్శకులుగా తమిళ దర్శకుడు పా.రంజిత్ లేదా ఎవరైనా మరాఠీ దర్శకుడిని ఎంచుకుంటే మంచిది. బడ్జెట్ కి ఢోకా లేదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలాగా రాంచరణ్ , నాగేంద్రబాబు లేదా ఉపాసన బాధ్యత తీసుకుంటే సరిపోతది. సైరా తో పోల్చితే వెరీ లో – బడ్జెట్ మూవీ. లేదా వారికి వీలు కాకుంటే కోట్లాది మహాత్మ జ్యోతిరావుఫూలే – సావిత్రమ్మల వారసులు క్రౌడ్ ఫండింగ్ ద్వారా సమకూర్చగలరు. దానికి తగ్గ లాభాలు ఉంటాయి.ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ వలే కేవలం మన ప్రాంతానికే కాకుండా దేశ వ్యాప్తంగా తెలిసిన వ్యక్తి పూలే కాబట్టి ఒకేసారి అన్ని భాషల్లో విడుదల చేయవచ్చు. దానికి చిరంజీవి గారు మనస్పూర్తిగా ఆనందంగా ఒప్పుకోగలిగినట్లైతే తన కమిట్మెంట్ , టాలెంట్ మరియు తన ఇమేజి తోడై భారతీయ సినీ చరిత్రలో తన ప్రయాణం ఒక గొప్ప దశకి చేరుకుంటది. తన జన్మ ధన్యమైతుంది. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా, రాజకీయ మరియు భావజాల వారసుడైన జనసేనాని, పవర్‌ స్టార్ పవన్ కల్యాణ‌్ గారు కూడా చొరవ తీసుకుంటే మంచిది.

చిరంజీవి గారు హీరోగా ‘ మహాత్మ జ్యోతిరావు పూలే ‘ సినిమా రావాలని కోరుకుంటున్నాను. దానికి ముందు సైరా మూవీ సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను. అది అయినా కాకున్న నెక్స్ట్ మూవీగా ‘మహాత్మ జ్యోతిరావు పూలే’ వస్తుందనే ఆశతో…,

 • వెంకటకిషన్ శాక్య
  మంచిర్యాల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here