తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన కల్యాణపు శ్రావ్య ‘మిస్ వరల్డ్ కెనడా’ పోటీలకు ఎంపికైంది.1996లో జన్మించిన శ్రావ్య ఆదిలాబాద్ లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో చదువుకుంది. శ్రావ్య తండ్రి రవికుమార్ ఇచ్చోడ మండల వ్యవసాయాధికారిగా పనిచేస్తుండేవారు. శ్రావ్యకు పదేళ్ల వయసు(2005) ఉన్నపుడు ఆమె తండ్రి రవికుమార్ ఉపాధి నిమిత్తం కెనడాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం శ్రావ్య యూనివర్సిటీ ఆఫ్ అల్బెర్టాలో కెమికల్ ఇంజినీరింగ్ చదవుతోంది. శ్రావ్య కి మోడలింగ్‌పై ఎంతో ఆసక్తి ఉండేది. మూడేళ్ల కిందటే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన శ్రావ్య ఇప్పటికే ‘మిస్ నార్తర్న్ అల్బర్టా’ కిరీటం సొంతం చేసుకుంది. ఈ జులై 16 నుంచి 23 వరకు నిర్వహించనున్న ‘మిస్ వరల్డ్ కెనడా-2017’ పోటీలకు ఎంపిక కావటంతో శ్రావ్య విజయం సాధించాలని ఆమె చిన్ననాటి మిత్రులు, స్కూలు యాజమాన్యంతో పాటు సొంత జిల్లా ఖమ్మం వాసులు కోరుకుంటున్నారు. ఆదిలాబాద్‌లో ఆమె పేరిట భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.