తెలంగాణ పెళ్లి సందడికి ఎవరైనా ఫిదా కావాల్సిందే

0
1247
    తెలుగు సినిమాలో పెళ్లి అంటే మనకి పెళ్లిసందడి సినిమా గుర్తొస్తుంది. పెళ్లి చూపులు నుంచి అల్లుడి మర్యాదలు,ఆటలు పాటలు ,పెళ్లి వంటకాలు ,పెళ్లి తర్వాత అప్పగింతలు …ఇలా సినిమాల్లో పెళ్లి చూస్తే ప్రతి పెళ్లి కాని కుర్రాడికి ,పెళ్లికాని అమ్మాయికి ఊహల్లో తేలిపోతూ తమ పెళ్లి ఇలా కావాలని కోరుకుంటారు. కాని ఇలా తెలుగు సినిమాల్లో ఎక్కువగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన పెళ్లి పద్ధతుల్లో ఉండటం వలన తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది కనెక్ట్ అయ్యేవాళ్ళు తక్కువ ఎందుకంటే తెలంగాణాలో పెళ్లిళ్లు సాదాసీదాగా జరగటం ,కొన్ని విభిన్న పద్ధతుల్లో జరగటం వలన ఏమో లేక సినిమా కథల్లో ఆ సందర్భం రాకపోవటం వలన ఏమో తెలంగాణ పెళ్లి పద్దతులకు ఇప్పటివరకు సినిమా లో చోటు దక్కలేదు.
    కాని సహజ పద్ధతుల్లో కథనం నడిపించే శేఖర్ కమ్ముల ఫిదా సినిమాలో ఒక గ్రామీణ తెలంగాణ అమ్మాయి కథను చెప్పటం ద్వారా అయన తెలంగాణ పెళ్లి పద్దతులను ఆడియెన్సుకి పూసగుచ్చినట్లు చూయించారు.ప్రధానంగా పెళ్లి కి ఒక రోజు ముందు రోజున వదువరుల ఇద్దరి ఇంట్లో పందిరి వేస్తారు,ఈ కార్యక్రమాన్ని పైడిముడుపు అంటారు. ఆ రోజు వదువరులకు వాళ్ళ వాళ్ళ పెద్దలు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. అపుడు జోడు ఎడ్ల కాండీని పెట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు(ఇది ఒక కట్టే తో చేయబడిన వస్తువు ,ఇది ఎడ్ల బండి కట్టేటప్పుడు రెండు ఎడ్లను కలపటానికి ఉపయోగిస్తారు) . ఈ పద్దతి గురుంచి చాల మందికి తెలియదు కాని శేఖర్ కమ్ముల సింబాలిక్ గా చూయించారు.
    రెండవది వదువరులను ఊరేగింపు చేసేటపుడు చేనేత గొడుగులు పట్టుకొని ఊరేగిస్తారు. ఈ పద్దతిని బాగా చూయించాడు కమ్ముల. మూడవ విషయం తెలంగాణ పెళ్లి భోజనంలో కచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే అది లేకపోతె పెళ్లి విజయవంతం కానట్లే లెక్క . ఈ విషయాన్నీ కూడా ఫిదా లో మనం చూడొచ్చు.

    ఇవే కాకుండా బతుకమ్మ ఆటలు ,రైతు కష్టాలు ,హీరో ఉసిరికాయ పచ్చడి అడిగినపుడు హీరోహిన్ ఊళ్ళో ఎక్కడో ఉన్న ఇంట్లో వెళ్లి పచ్చడి తేవటం సన్నివేశంతో తెలంగాణ పల్లెల్లో ప్రేమలు ఎలా ఉంటాయో చక్కగా చూపాడు. తెలంగాణ అమ్మాయిలు ఎంతటి బలమైన వ్యక్తిత్వం ఉంటోందో చెప్పాడు. ఇక హీరోహిన్ ,వాళ్ళ అక్క పాత్రలు పల్కిన యాసలు సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు.
    ఇలా తెలంగాణ సంస్కృతిని ,యాసను ,పద్దతులను తన సినిమాలో చూపించటం ద్వారా శేఖర్ కమ్ముల కి ఎవరైనా ఫిదా కావాల్సిందే. సాహో శేఖర్ కమ్ముల ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here