కుటుంభ సమేత సమ్మోహనం : రివ్యూ

0
3081

మానవీయకోణాన్ని స్పృశిస్తూ మన చుట్టు పక్కన జరిగే అంశాలను కమెర్షియల్ హంగులు అద్దటంలో దర్శకుడు ఇంద్రగంటి సిద్ధహస్తుడు. ప్రతి సినిమాలో కొత్తదనం చూపించటంలో ముందుండే నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. వీళ్ళ కాంబినేషన్ లో జెంటిల్మన్ సినిమా తర్వాత వచ్చిన సినిమా సమ్మోహనం. దీనికి తోడు తెలుగమ్మాయి అయిన బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు టాలీవుడ్ ప్రవేశం ,ప్రేమ కథ చిత్రం లాంటి విభిన్నకథ సినిమాల హీరో సుదీర్ బాబు. ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా విశ్లేషణ ఒకసారి చూద్దాం.

విశ్లేషణ
కథ విషయానికొస్తే ఒక సినిమా హీరోయిన్ ,ఒక మధ్యతరగతి కి చెందిన వ్యక్తి అది కూడా సినిమాలంటే ఇష్టముండని హీరో మధ్య ప్రేమకథే సమ్మోహనం. ఇలాంటి కథలతో ఎన్నో సినిమాలు వచ్చినా కూడా ఏదైనా లాజికల్ పాయింట్ ఉంటె తప్ప ప్రేక్షకులు ఆదరించరు. నిజానికి నిజ జీవితంలో ఇలాంటి ప్రేమకథలు కనబడవు ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య జరిగే ప్రేమ కథనాలకు ప్రేక్షకులు కనెక్ట్ కాకపోతే సినిమా లో రెండున్నర గంటలు వృధా అవుతుంది. కాని హీరో తండ్రి(నరేష్) ఒక సినిమా పిచ్చి ఉన్నవాడుగా చూపించి ,జీవితంలో ఎప్పటికైనా ఒక సినిమా లో నటించి తన సత్తాను చాటాలనుకొని ,చివరికి ఇంట్లో తెలియకుండా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరుగుతుంటాడు. అపుడు హీరోయిన్ పనిచేసే ఒక సినిమా షూటింగ్ కి మంచి విలాసవంతమైన ఇల్లు కోసం తిరుగుతున్న ప్రొడక్షన్ మేనేజర్ కి నరేష్ ఇల్లు నచ్చటం ,దానికి వేషం ఇస్తే ఇల్లు ఫ్రీగా షూటింగ్ కి ఇస్తా అని నరేష్ ఆఫర్ చేయటం దానికి మేనేజర్ డబ్బులు మిగులుతాయని అనుకోని షూటింగ్ మొదలుపెట్టటం,అపుడు హీరో హీరోయిన్ కలవటం జరుగుతుంది. ఈ సింపుల్ పాయింట్ తో దర్శకుడు ప్రేక్షకులను కాంప్లెక్స్ కథకు కనెక్ట్ చేయటం ద్వారా సగం విజయం సాధించాడు. ఈ పాయింట్ ద్వారా నరేష్ పాత్రను సృష్టించి ఆ పాత్ర స్వభావాలను ప్రేక్షకులు తనివితీరా ఆస్వాదించేటట్టు చేసి నరేష్ ని తెర ముందు హీరోని చేసి దర్శకుడు తెర వెనుక హీరోగా నిలిచాడు. ఎందుకంటే ప్రతి ప్రేక్షకుడు వీళ్లిద్దరి గురుంచే మాట్లాడుకుంటారు.

సినిమాకు దర్శకుడు కెప్టెన్,అయన సినిమా బాగా నడిపిస్తేనే సినిమా షిప్ సాఫీగా నడుస్తుంది. ఇంద్రగంటి గారు ఎక్కడా బోర్ కొట్టకుండా అయన మార్కుతో సినిమాను తెరకెక్కించాడు. ప్రతి పాత్రలో ,సన్నివేశంలో ,మాటల వెనుక ఉన్న పెన్నులో ఇది ఇంద్రగంటి గారు మాత్రమే రాయగలరు,తీయగలరు అనే విదంగా సినిమా ఉంటుంది. ఉదాహరణకు నరేష్ పాత్ర తీసుకుంటే ఒక 50 ఏళ్ల వ్యక్తి సినిమాల్లో నటించాలనే తాపత్రయం ,ఆయనకు వచ్చే ప్రతి అవకాశాన్ని వదులుకోకపోవటం,ఒక వేళా ఛాన్స్ వస్తే చిన్నపిల్లాడిలా నిద్రలో కూడా స్క్రిప్ట్ పేపర్ ని పట్టుకోవటం ,తన డైలాగులను ప్రాక్టీస్ చేయటం వంటి స్వభావాలను కేవలం ఇంద్రగంటి మాత్రమే సృష్టించగలడు అనే విదంగా యూనిక్ గా ఉంటుంది. ఇక సినిమా వాళ్ళు అంటే ఇష్టం లేని హీరో పాత్ర ను సృష్టించి సినిమా వాళ్ళు కూడా మాములూ మనుషులే అని చివరికి నిర్దారించుకునే తీరును ఇంద్రగంటి బాగా తెరకెక్కించాడు. హీరోయిన్ పాత్ర ,మేనేజర్ కాదంబరి కిరణ్ ,సినిమా వాళ్ళు పరిచయం అయితే గాసిప్పులు సేకరించి ఒక సినిమా వెబ్ సైట్ పెట్టి లైఫ్ లో సెట్ అవ్వొచ్చు అనుకునే హీరో మిత్రుల పాత్రలు ఇలా ప్రతి పాత్ర కూడా జనాలకు నచ్చేవిదంగా ఉంటుంది.
ఇక మాటల విషయానికొస్తే సినిమాలంటే ఇష్టం లేని హీరో జనాలు సినిమాల వలన కొట్టుకుంటున్నారు అని అంటే దానికి హీరో తండ్రి బదులిస్తూ ఆలా ఐతే అప్పట్లో ఏ సినిమాలు చూసి రామాయణ ,మహాభారత యుద్దాలు వచ్చాయి అనటం ,క్లైమాక్స్ లో హీరోయిన్ తో హీరో “నీ లాంటి తార కోసం గేలక్సీ కైనా వస్తా” అంటే దానికి హీరోయిన్ గేలక్సీ కైతే రావొచ్చుకాని ఈ ట్రాఫిక్ లో విప్రో సర్కిల్ దగ్గరికి రాలేవు లాంటి మాటలతో సినిమాను నడిపించటమే కాదు సమాజం పట్ల ఆయనకున్న ఇష్టాన్ని తెలియచేస్తాయి.దర్శకుడు ఈ సినిమాలో సినిమా ఇండస్ట్రీలో భావదారిద్రం ఎలా ఉంటుంది,మోసాలు ఎలా జరుగుతాయి,అందరూ ఇండస్ట్రీలో తిమింగలాలు లాగా ఉండరు ,కొన్ని అందమైన మంచి చేపలు కూడా ఉంటాయి అని పరోక్షంగా సందేశం ఇచ్చాడు.

ఇక హీరో సుదీర్ విషయానికొస్తే ప్రతి సన్నివేశంలో బాగా చేశాడు. ప్రధానంగా తన ప్రేమను చెప్పే సన్నివేశం ,తన తాత నానమ్మల ప్రేమకథను హీరోయిన్ కు చెప్పే సన్నివేశాల్లో సుదీర్ నటన సూపర్బ్. హీరోయిన్ అదితి హీరోయిన్ పాత్రలో ఒదిగిపోయింది. ఎంత స్టార్ అయినా కూడా తాను కూడా ఒక మనిషినే అని మానవత్వం ,ఎమోషన్స్,సమస్యలు ఉంటాయనే పాత్రలో బాగా చేసింది. తెలుగు రాని హీరోయిన్ గా ఆమె చెప్పే డైలాగులు నవ్వులు తెప్పిస్తాయి.
ఇక సీనియర్ నటుడు నరేష్ ఈ సినిమాకు ఆయువుపట్టు అనే చెప్పాలి. నటుడైన నరేష్ లేకుండా సినిమాను ఊహించుకోలేము. 80 లలో హాస్య హీరో అయిన నరేష్ కు మంచి స్క్రిప్టులు వస్తే బ్రహ్మానందం స్థానాన్ని భర్తీ చేయొచ్చు.

ఇక సినిమాలో శివలెంక గారి నిర్మాణ విలువల్లో అయన మార్క్ కనబడుతుంది.
పెళ్లి చూపులు సంగీత దర్శకుడు వివేక్ సాగర్ గారి బాణీలు బాగా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ లో కీలక సన్నివేశాల్లో ఇచ్చిన నేపధ్య సంగీతం ఇంకా బాగుంటే సినిమా స్థాయి పెరిగేది. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ సినిమాకు ప్లస్ పాయింట్.

చివరగా చెప్పాలంటే సినిమా లో ఒక సినిమా షూటింగ్ సన్నివేశం ఉంటుంది. దానిలో హీరోయిన్ షాట్ అయ్యాక నవ్వుతూనే ఉంటుంది. ఈ సినిమా చూసాక ప్రేక్షకుడు సినిమాలోని నవ్వులను,మాటలను,భావోద్వేగాలను తనతోపాటే ఇంటికి తీసుకెళ్తాడు.

 

ప్లస్ పాయింట్స్ 

  • కథ ,కథనం ,మాటలు ,దర్శకత్వం
  • హీరో,హీరోయిన్
  • నరేష్
  • పాటలు
  • ఫోటోగ్రఫీ

మైనస్ పాయింట్స్

  • మొదటి భాగంలో డ్రామా కొంచెం ఎక్కువైంది
  • రెండవ భాగంలో నేపథ్య సంగీతం సన్నివేశాలకు అనుగుణంగా లేదు

రేటింగ్:3.5/5

Author: Ravinder Ryada

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here