రంగస్థలం రివ్యూ :ఈస్టమన్ ఎన్నికల యుగానికి డిజిటల్ రంగుల సొగసులు

1
668

రంగస్థలం సినిమా 1980 నాటి ఒక పీరియాడిక్ సినిమా అని సుకుమార్ ప్రకటించగానే సినిమా మీద అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. దానికి తోడు చరణ్ చెవిటి వ్యక్తిగా నటించటం ,పొలిటికల్ డ్రామా అనగానే హైప్ ఆకాశానికి చేరింది. సుకుమార్ మీద ప్రేక్షకులకు నమ్మకం ఉన్నా కూడా సినిమాను ఎలా హ్యాండిల్ చేస్తాడో అని నాకు సినిమా విడుదల అయ్యే వరకు కొన్ని సందేహాలు ఉండేది . ఆ సందేహాలు నాకు ఎలా నివృత్తి అయ్యాయి ,సినిమా హైలైట్ ఏంటో ఒకసారి చూద్దాం.

హైలైట్ 1
ఇప్పటి వరకు సుకుమార్ అల్ట్రా పాష్ సినిమాలు ,ఇంటెలిజెంట్ సినిమాలు ,యూత్ చిత్రాలు తీసాడు కాని మొట్టమొదటి సారిగా ఒక పీరియాడిక్ సినిమాను అది కూడా గ్రామీణ నేపథ్యంలో ఉన్న సినిమాను తీసాడు. అయితే సినిమా మొదలు అవ్వగానే 5 నిమిషాల్లో ప్రకాష్ రాజ్ కి జరిగిన ఆక్సిడెంట్ లో తర్వాత ట్రాక్టర్ లో హాస్పిటల్ కి తీసుకోపోయే సీన్ చూశాక ఈ సందేహం పూర్తిగా నివృత్తి అయింది. సుకుమార్ తీసుకున్న ఈ జాగ్రత్త ఆదిలోనే ఆయన తీసుకున్న సబ్జెక్టు పాస్ మార్కులు పొందేలా చేశాయి. ఎందుకంటె 80 లలో ఊళ్లలో ఎవరికైనా ఏమైనా జరిగితే ఇపుడున్న కార్లు ఉండేవి కావు ,వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్ సహాయంతో హాస్పిటల్ కి తీసుకెళ్తుండే వాళ్ళు. ఆ క్రమంలో ఎంతో మంది మధ్యలోనే ప్రాణాలను వదిలేసేవారని పెద్దలు చెబుతారు. అప్పట్లో ఆడవాళ్లు బాత్రూం లో స్నానం చేసేటపుడు బయట ఉన్న వాళ్లతో తాము స్నానం చేస్తున్నామని విషయం పట్టించుకోకుండా బయట వాళ్లతో మాట్లాడే వాళ్ళు . అనసూయ ,చరణ్ ల ఒక సన్నివేశంలో ఇది మనం చూడొచ్చు. అప్పట్లో ఊళ్ళల్లో కరెంట్ లేకపోవటంతో ఇంజన్ లతో గ్రౌండ్ వాటర్ ని బయటకి తీసుకొచ్చి వ్యవసాయానికి నీళ్లను అందించేవాళ్ళు. చరణ్ నీళ్లు అందించే పాత్ర ద్వారా సుకుమార్ 80 లో ఉన్న ఫ్లేవర్ ని 3 గంటలు నడిపించాడు.
కరీం బీడీ ,తాటి కల్లు ,అట్లాస్ సైకిల్ ,పేషెంట్ కి ఆక్సీజన్ పెట్టటం ,పాత కార్లు ,జగపతి బాబు ఇంట్లో  రేడియో మ్యూజిక్ ,పెత్తందారీ వ్యవస్థలో బడుగు వర్గాల అంటరానితనం ముఖ్యంగా ఇంటికి వచ్చిన వ్యక్తికీ గ్లాస్ లో మజ్జిగ ఇచ్చి వచ్చిన వాళ్ళతోనే గ్లాస్ ని కడిగించటం ,హరి కథలు ,దెబ్బ తాకితే పసుపు రాకటం ఇలా చెప్పుకుంటూ పొతే చాలానే కనపడతాయి . అప్పట్లో గోదావరి జిల్లా నుంచి ఎక్కువ మంది దుబాయ్ వెళ్లే వారు ఈ సినిమాలో కూడా దుబాయ్ లో సంపాదించి స్వగ్రామానికి వచ్చి ఎన్నికల్లో నిలబడే పలు పాత్రలు కనిపిస్తాయి. అప్పట్లో గ్రైండర్లు ,గ్యాస్ స్టవ్ లు లేని కాలంలో సమంత తో కట్టెల పొయ్యిలో గొట్టంతో ఊదించటం ,తర్వాత సమంత చాటతో పప్పును చెరిగే సన్నివేశంలో మధ్యలో పప్పు గింజను నోట్లో వేసుకోవటం చూస్తే సుకుమార్ కి పల్లెటూరు మీద ఉండే ప్రేమను తెలుపుతుంది.

హైలైట్ 2

ఈ సినిమాలో మెయిన్ హైలైట్ కచ్చితంగా చిట్టి బాబే . ఇప్పటివరకు చరణ్ చేసిన సినిమాలు కమర్షియల్ బేస్ లో వెళ్లడం ,సంపూర్ణమైన నటనకు స్కోప్ లేకపోవటం వలనో కాని చరణ్ చెవిటి పాత్ర వేస్తున్నాడంటే జనాలు సినిమా ఎలా ఉంటోందో ,చరణ్ ఎలా చేస్తాడో అని సందేహ పడ్డారు . కాని సినిమా చూశాక చరణ్ లేకుండా ఈ సినిమా ఉండదని అనుకునేలా చేశాడు. ఒక విదంగా చిరంజీవి గారు ఆపద్బాంధవుడు ,పున్నమి నాగు ,విజేత ,స్వయం కృషి ,దొంగ మొగుడు సినిమాల్లో పాత్రల్లో ఎంత ఒదిగిపోతాడో అంతలా ఒదిగిపోయాడు. తాగుబోతుగా కొన్ని సన్నివేశాలలో నవ్విస్తూ ఏడిపిస్తూ ప్రేక్షకులకు కంటతడి పెట్టాడు. అనసూయ తో ఒక సన్నివేశంలో కొద్దిసేపు ఏడ్చి వెంటనే నవ్వేసే సందర్భం ఉంటుంది.దానిలో ఒకే షాట్ లో ఏడుపు ఎక్సప్రెషన్ నుంచి వెంటనే నవ్వే ఎక్సప్రెషన్ కి మారిపోయే విధానం చూసినపుడు థియేటర్ లు చప్పట్లతో మారుమోగాయి. ఈ ఒక్క సీన్ రిఫరెన్స్ తో ఎన్నో చరణ్ కి ఎన్నో అవార్డులు వచ్చే అవకాశం ఉంది. సహజమైన డాన్సులు ,కోపం ,అమాయకత్వం ,ఎమోషన్ లాంటి రసాలను పీక్స్ కి తీసుకెళ్లాడు చరణ్ . ఈ సినిమాలో ప్రతి సన్నివేశం పండిందంటే చరణ్ పాత్రే కారణం . ఉదాహరణకు అనసూయ తో కాంబినేషన్ సీన్లు ,ఆదితో సీన్లు ,సమంత తో ఉండే రొమాంటిక్ సీన్లు ,ప్రకాష్ రాజ్ ,కమెడియన్ మహేష్ ,సీనియర్ నరేష్ సీన్లు ,జగపతిబాబు తో సీన్లు ఇలా ప్రతి సీన్ పండటానికి చిట్టిబాబే కారణం . ఒకవేళ చిట్టిబాబు క్యారెక్టర్ సరిగ్గా పండక పోయి ఉంటె సినిమా కచ్చితంగా డిజాస్టర్ గా మిగిలిపోయేది. ప్రధానంగా చెవిటి వ్యక్తిగా పరకాయ ప్రవేశం చేశాడు ఎంతలా అంటే చిట్టి బాబు మాట్లాడే ప్రతి మాట లో ,వేసే ప్రతి స్టెప్పులో ,ప్రతి ఫైట్ లో చిట్టిబాబు చెవిటివాడుగా మనకు కనిపిస్తాడు. సుకుమార్ కూడా చెవుడు అనే వైకల్యాన్ని తీసుకొని సినిమాను 3 గంటల పాటు చిట్టి బాబు తో ఎక్కడ బోర్ కొట్టకుండ తీసాడు.

హైలైట్ 3

ఇందులో మరో హైలైట్ ప్రతి పాత్ర ,ఆ పాత్రలు చెప్పే మాటలు ,అవి వ్యవహిరించే తీరు . ఉదాహరణకు సీనియర్ నరేష్ పాత్ర తీసుకుంటే ఊళ్ళో టైలర్ పని చేస్తూ ఇద్దరు కొడుకులు ,ఒక కూతురు ,భార్యతో తన అమ్మ కస్టపడి కొన్న 2 ఎకరాల పొలంతో ఆత్మగౌరవంగా బతికే ఒక మధ్య తరగతి మనిషి . ఒక సందర్భంలో ఊరి సర్పంచ్ తన అమ్మ మీద అబాండాలు వేసినపుడు రాత్రికి అన్నాన్ని తింటూ మధ్యలో ప్లేట్ చేతులు కడిగేసుకొని అర్ధరాత్రి బట్టలు కొడుతుంటాడు కోపంగా . ఆలా డిప్రెషన్ ఉండి కూడా తన మధ్యతరగతి బాధ్యతలను గుర్తు చేసుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోవటం అప్పట్లో ప్రతి ఒక్క ఇంటి యజమాని దగ్గర ఉండేది. ఇలా సినిమాలో ప్రతి పాత్ర సహజంగా ప్రవర్తిస్తుంటాయి.
అనసూయ పాత్ర ప్రతి ఊళ్లలో మనకి కనిపిస్తుంటుంది. భర్త దూరంగా ఉండటం వలన మొండితనం ఎలా వస్తుందో బాగా చూపెట్టాడు సుకుమార్. ఆది ఐతే 80 ల్లో ఒక మధ్య తరగతి ఉద్యోగి అన్యాయాన్ని ఎలా ఎదిరించాడో అనే పాత్రలో బాగా ఒదిగిపోయాడు. సమంత పాత్ర గురుంచి చెప్పాలంటే తండ్రి తాగుబోతు కావటం వలన వ్యవసాయపు బాధ్యతలు నెత్తి మీద పెట్టుకొనే యువతిగా తాను చదువుకున్న 6 వ్ క్లాస్ తో పూర్తిగా సెల్ఫ్ట్ కాంఫిడెన్స్ ఉన్న అమ్మాయిగా కనిపిస్తుంది. నిజానికి ఈ పాత్ర ని కరెక్ట్ గ సుకుమార్ డిజైన్ చేశాడు. ఎందుకంటే ఈ రోజుల్లో జనాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన కూడా ఆత్మవిశ్వాసం కనబడదు. ఆ రోజుల్లో 2 వ తరగతి చదివిన వాళ్ళు కూడా తమకున్న ఆత్మవిశ్వాసంతో పెద్ద స్థాయికి వెళ్ళటం జరిగింది . బ్రహ్మాజీ పాత్ర కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎలా ఉండేవాడో చక్కగా ఒదిగిపోయాడు. ఇక జగపతి బాబు ప్రెసిడెంట్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. అధికారం ఉంటె రాజుల బతికి ప్రజల్లో విప్లవం వచ్చాక అదికారం కోల్పోయాక అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం చూస్తే 80 లో పెత్తందారీ వ్యవస్థ ని గుర్తు చేస్తుంది. అప్పట్లో విప్లవకారులకు బయపడి ఊరికి దూరంగా బతికే పాత్రలో జగపతి తన మార్కును చూయించాడు.

హైలైట్ 4
ఈ సినిమా కు సుకుమార్ ఎంత కష్టపడ్డాడో ప్రతి ఫ్రేములో కనిపిస్తుంది.ప్రధానంగా చరణ్ ఆదిలా మధ్య ఉన్న అనుబంధం చాల బాగుంటుంది. చిన్న చిన్న విషయాలను కూడా వదలలేదు. ఉదాహరణకి ఆది చొక్కాను చరణ్ వేసుకుంటే ఆది తిట్టాడని చరణ్ అలిగే సన్నివేశం చూస్తే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. 80లో ను వ్యవసాయం యంత్రాలు లేక మొక్క జొన్న ను దంచటం ఇలా ప్రతిది సుకుమార్ సబ్జెక్టు మీద ఉన్న అవగాహన సూపర్బ్ .
సినిమాకు సుకుమార్ కథ రాసుకొని దానికి తగ్గట్టు గానే స్క్రీన్ ప్లే ఇచ్చాడో ,దేవి శ్రీ ప్రసాద్ కూడా ఎక్క తగ్గకుండా కెరీర్ బెస్ట్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. కొన్ని యాక్షన్ సీన్లలో ఐతే రోమాలు నిక్కబొడిచాయి. చివరిలో వచ్చే ఒక పాట కచ్చితంగా ఎవరిపైన చనిపోతే వేసే కొన్ని ప్రత్యేక పాటల్లో నిలిచిపోతుంది. ఆ గట్టున ఉంటావా పాట లో అప్పట్లో ఎన్నికల ప్రచారం ఎలా ఉండేదో ఆలా ఉంది. రత్నవేలు ఫోటోగ్రఫీ సినిమాకు అదనపు ఆకర్షణ . కోరియోగ్రఫీ చాలా సహజంగా ఉంది. ఎంత సక్కగున్నవే ,మంగమ్మ పాటల్లో రామ్ చరణ్ ,సమంత హావభావాలు బాగున్నాయి. నిర్మాణపు విలువలు సూపర్బ్ .

చివరగా మాములుగా ఒక సినిమా రివ్యూ రాయాలంటే కథ ,కథనం ,విశ్లేషణ ,పాత్రలు ఇలా ఒక ఆర్టికల్ లో రాయటం జరుగుంది. కాని మొదటిసారిగా ఈ సినిమాలో ప్రతి పాత్రకు ,ప్రతి సన్నివేశానికి ,ప్రతి పాటకు ఒక రివ్యూ రాసేంత పని పెట్టాడు సుకుమార్ .ఏది ఏమైనా ఈ సినిమా చాల రోజుల తర్వాత తెలుగులో ఒక ట్రెండ్ సెట్టర్ గ మిగిలిపోయే అవకాశం ఉంది .కచ్చితంగా జాతీయ అవార్డు వచ్చే స్థాయిలో ఉంది.

రేటింగ్ :4. 5/5
తీర్పు : ఈస్టమన్ ఎన్నికల యుగానికి డిజిటల్ రంగుల సొగసులు

 

Ravinder Ryada

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here