నవతరం పూలే:పుంజాల శివశంకర్

0
2712

 

 

మన రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంటూ బ్యానర్లలో ,టీవీ ప్రకటనల్లో ,ఎన్నికల ప్రచారంలో ఊకదంపుడు ప్రచారం చేసుకుంటారు. ఎన్నికల్లో గెలిచి అధికార ఫలాలను అనుభవిస్తారు కాని బిసిలకు మాత్రం మొండిచేయి చూపుతారు. కాని బీసీల మద్దతుతో గెలిచి తన జీవితాన్ని బీసీలకు అంకితం చేసిన నాయకులు చాల తక్కువ మంది కనిపిస్తారు. ఆలా బీసీల అభివృద్ధికి తోడ్పడిన వాళ్లలో పుంజాల శివ శంకర్ గారు మొదటి వరుసలో ఉంటారు. నిజానికి బిసిలు అంటే జ్యోతిరావు పూలే గుర్తొస్తాడు. కాని ఈ తరంలో దేశం చూసిన పూలే ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా శివశంకర్ గారికి మొదటి స్థానం దొరుకుతుంది.

కింది స్థాయి నుంచి ఎదిగి నాయకులూ అయ్యే వారు చాల మంది ఉంటారు ,కాని ఒక బలహీన వర్గాల కుటుంబంలో అది కూడా ఒక పేద కుటుంబంలో పుట్టి దేశ రాజకీయలను ఒక దశాబ్దం పాటు శాసించే స్థాయికి ఎదగటం అంటే మాములు విషయం కాదు . అది కూడా ఇందిరా గాంధీ లాంటి మహామేధావి కి కుడి భుజంలాగా ఉండటం అంటే అంత సులువు కాదు. దానితో పాటు తాను బలహీన వర్గాల మనిషినని మర్చిపోకుండా బలహీనవర్గాల కోసం తీవ్రంగా పోరాడి, ఎంతో మంది అగ్రకుల ముఖ్యమంత్రులు కేంద్రమంత్రులకు వ్యతిరేకంగా నిలిచి బీసీలకు రిజర్వేషన్లు సాధించిన ఘనుడు పుంజాల శివ శంకర్ గారు. ఒక న్యాయవాదిగా ,సుప్రీం కోర్ట్ జడ్జిగా,న్యా శాఖ మంత్రిగా ,పెట్రోలియం మంత్రిగా ,రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా చివరికి దేశంలోని బిసి నాయకుడిగా కీర్తి గావించారు. అయితే సోమవారం నాడు కేంద్ర మాజీమంత్రి పుంజల శివశంకర్‌(87) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఒక్కసారి పుంజాల శివ శంకర్ గారి జీవన ప్రయాణాన్ని మన తెలంగాణ కబుర్లు తెలంగాణపీడియా లో ఒక్కసారి చూద్దాం.

 

నేపథ్యం

శివశంకర్ గారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం మామిడిపల్లిలో 1929 ఆగస్టు 10న జన్మించారు. శివశంకర్‌ ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్‌లో, కాలేజీ చదువు అమృత్‌సర్‌లో సాగింది. అమృతసర్‌లో బీఏ ఆనర్స్‌ చదివిన ఆయన 1952లో ఎల్‌ఎల్‌బీ పాసయ్యారు. హైదరా బాద్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించి, సిటీ సివిల్‌ కోర్టు బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడిగా, 1974లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. 1977లో ఇందిరాగాంధీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆమెకు ప్రత్యేక న్యాయవాదిగా వ్యవహరించారు. తర్వాత ఇందిర ఆహ్వానంతో 1979లో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో భారీ విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.

1980లో న్యాయశాఖ, 1982లో కేంద్ర ఇంధన శాఖ మంత్రిగా పనిచే శారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు పెంచేందుకు విశే షంగా కృషి చేశారు. 1985లో గుజరాత్‌ నుంచి రాజ్య సభకు వెళ్లి వాణిజ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1986లో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 1994 సెప్టెంబ ర్‌లో సిక్కిం గవర్నర్‌గా, 1995లో కేరళ గవర్నర్‌గా బాధ్యత లు చేపట్టారు. 1998లో తెనాలి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ప్లానింగ్‌ కమిషన్‌ డిప్యూటీ చైర్మన్‌గా కూడా శివశంకర్‌ పని చేశారు. ఇందిర, రాజీవ్‌గాంధీ ప్రభుత్వ హయాంల లో కేంద్రమంత్రిగానే కాకుండా కీలకమైన నేతగా శివశంకర్‌ చక్రం తిప్పారు. మల క్‌పేట మాజీ ఎమ్మెల్యే సుధీర్‌కు మార్‌ శివశంకర్‌ కుమారు డే. ఎందరో నాయకులకు శివశంకర్‌ రాజకీయ గురువుగా నిలిచారు. వారిలో అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నేతలుగా రాణించారు.అయన తెలుగు మరియు ఇంగ్లీష్, ఉర్దూలో నిష్ణాతులు కావటం వలన భిన్న సంస్కృతులకు ,కులాలకు ,మతాలకు నిలయంగా ఉండే హైదరాబాద్ కి ఆ రోజుల్లో తన ఆయనే ఒక చిహ్నంగా నిలిచాడు.

బీసీ వర్గీకరణలో కీలక పాత్ర

 

సుప్రీంకోర్టులో శివశంకర్‌ పోరాటం తో బీసీ రిజర్వేషన్లలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ విధానం ఏర్పడింది. 1972లో వెనుకబడిన తరగతులకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఆ తర్వాత అనంతరామన్‌ కమిషన్‌ ప్రభుత్వానికి సూచనలు చేస్తూ బీసీ కులాలకు 30% రిజర్వేషన్లు ప్రతిపాదించింది. దీనిపై ఏపీ హైకోర్టులో 110 రిట్‌ పిటిషన్లు దాఖలయ్యా యి, అప్పుడు బీసీలకు 30% రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టు తీర్పునివ్వగా… అప్పటి JAC తరపున శివశంకర్‌ సొంత ఖర్చుతో 18 నెలలు ఢిల్లీలో ఉండి సుప్రీం కోర్టులో బీసీ రిజర్వేషన్లను గెలిపించుకొని వచ్చారు,భావి తరాలకు చెదరని బహుమతి నిచ్చారు.బీసీ B,బిసి D లో కొన్ని కొత్త కులాలను చేర్చటంలో కృషి చేశాడు. దానితో కొందరి కుట్రతో ఆ బిసి కులాలను బిసి ల జాబితా నుంచి తీసివేసి మళ్ళి ఓసీల్ల్లో చేర్చారు. దీనితో మళ్ళి ఆ కులాలను బీసీల్లో చేర్చటం పై న్యాయస్థానంలో ఎనలేని పోరాటం చేసి విజయం సాధించాడు.

 

కుటుంభం

అయన సతీమణి లక్ష్మి భాయి ,ఒక నాట్య కళాకారిణి ,80 ఏళ్ల వయసులో ట్రిపుల్ పీహెడీ చేసి సంచనలం సృష్టించి ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. శివశంకర్ గారికి ఇద్దరు కుమారులు.వారిలో ఒకరు మాజీ ఎమ్మెల్యే దివంగత నేత సుదీర్ కుమార్ కాగా ,మరొకరు దేశంలోని ప్రసిద్ధి గాంచిన కడుపుకు సంబందించిన గాస్ట్రోలోంజిస్ట్ వైద్యుడు వినయ్ కుమార్ . వినయ్ గారు ప్రజారాజ్యం పార్టీలో చాల చురుకు గా ఉండి పార్టీ పేరు ,ఎన్నికల గుర్తు రావటంలో కీలక పాత్ర వహించాడు. వినయ్ గారు లోకల్ బాడీ ఎన్నికల్లో బిసిలకు అధికారకమైన రిజెర్వేషన్లు కల్పించాలని సుప్రీమ్ కోర్ట్ లో రిట్ వేసి గెలిచి తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. ఈ కేసు గెలవటం వలన గత స్థానిక ఎన్నికల్లో సింహ భాగం నాయకులు బీసీలే ఉన్నారు. శివ శంకర్ గారి పెద్ద కోడలు అలేఖ్య పుంజాల దేశంలోని ప్రసిద్ధి గాంచిన కూచిపూడి నృత్యకారిణి. ఈమెకు రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. ఇలా తన కుటుంబంలో అందరు కూడా క్రమశిక్షణ తో మంచి పేరు సంపాదించుకున్నారు.

శివశంకర్‌ మృతిపట్ల గవర్నర్‌ నరసింహన్, ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌,రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్,కేశవరావు పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు. మంత్రులు మహమూద్‌ అలీ, నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్,  తలసాని శ్రీనివాస్‌యాదవ్,తుమ్మల నాగేశ్వరరావు, సీఎల్పీ నేత జానారెడ్డి, కేవీపీ రాంచంద్రారావు, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ, దానం నాగేందర్, మండలి బుద్ధప్రసాద్‌ తదితరులు నివాళులర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ సీఎం కె.రోశయ్య, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు శివశంకర్‌ మృతికి సంతాపం ప్రకటించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి తనకు శివశంకర్ గారు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులలో ఒకరు అని చెప్పటం  కొసమెరుపు. ఏది ఏమైనా బలహీన వర్గాలు ఒక మంచి నాయకుడిని కోల్పోయింది.

 

Author:Ravinder Ryada

Source:Naluvala Srinivas

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here