నయీం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ. 143 కోట్లు: కేసీఆర్

0
317

నయీం కూడబెట్టిన మొత్తం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ. 143 కోట్లని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మొత్తం 27 హత్య కేసుల్లో నయీం పాత్రను పోలీసులు గుర్తించారని, మరో 25 కేసుల్లో అతడి ముఠా పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో భాగంగా మూడోరోజు నయీం వ్యవహారంపై చర్చలో ఆయన పాల్గొని ముందుగా ఒక ప్రకటన చేశారు. ఆగస్టు 8వ తేదీన నయీంను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారని తెలిపారు. నయీం నేరప్రవృత్తిని సీరియస్‌గా తీసుకుని పూర్తిస్థాయి దర్యాప్తు కోసం సిట్‌ను నియమించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 174 కేసులు నమోదయ్యాయని, 741 మంది సాక్షులను విచారించి 124 మందిని అరెస్టు చేశారన్నారు.

రాష్ట్రంలో నయీం ముఠాకు సంబంధించిన స్థావరాలలో పోలీసులు సోదాలు చేశారని తెలిపారు. మొత్తం 2.95 కోట్ల నగదు, 21 కార్లు, 21 తుపాకులు, 26 బైకులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. నయీం బంధువుల పేరు మీద ఉన్న దాదాపు 1015 ఎకరాల భూమిని, లక్షా 67వేల చదరపు గజాల విస్తీర్ణం గల ఇళ్ల స్థలాల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారన్నారు. నయీం కేసులో ఇప్పటికే రెండు చార్జిషీట్లు దాఖలు చేశారని, త్వరలో మరో 15 చార్జిషీట్లు దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. నయీం ముఠా అంతంతో ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here