నల్లమల సరే… మరి తెలంగాణకు ఓపెన్ కాస్ట్ (ఉపరితల బొగ్గు బావులు) ఉరి …??

0
109

తెలంగాణ వనరుల విధ్వంసం గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాక ముందు తెలంగాణ వచ్చాకా అని చెప్పుకోవాలి భౌగోళికంగా ఉన్న విస్తారంలో  అతి ఎక్కువ స్థాయిలో సహజ వనరుల  లభ్యత ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో మన వాటా గురించి పొట్లాడి మన స్వరాష్ట్రం సాదించుకున్నాము అంత వరకు బాగానే ఉంది. తెలంగాణ వనరుల గురించి దోపిడీ గురించి, విధ్వంసం గురించి ఉద్యమం నడుస్తున్న కాలంలో టీఆరెస్ పార్టీ తో పాటు అన్ని సంస్థలు    ,ప్రజాసంఘాలు గొంతెత్తాయి.  టీఆరెస్ అధినేత నేటి తెలంగాణ ముఖ్యమంత్రి గౌ.చంద్రశేఖర్ రావు గారైతే అప్పటి తెలంగాణ ప్రాంతం బొందల గడ్డగా మారుతుంది అని, స్వరాష్ట్రం సిద్దించాకా ఓపెనకాస్ట్ మైనింగ్స్ రాకుండా అడ్డుకుంటామని పదే పదే అనేక సభల్లో స్పష్టంగా చెప్పిన సందర్భాలు కోకొల్లలు. బెల్లంపల్లి సభలో మాట్లాడుతూ ” తెలంగాణ వచ్చినాక కుర్చేసుకొని కూసోని ఓపెన్ కాస్ట్ లని ఆపుతాను ” అని అన్నాడు. తెలంగాణ వచ్చిన తరువాత ఒక్క ఓపెనకాస్ట్ గనిని కూడా అడ్డుకోక , అనేక కొత్త కొత్త ఓపెనకాస్ట్ గనులను ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం . ముఖ్యంగా ఉత్తర  తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (నేటి మంచిర్యాల) లో సింగాపూర్ , తాళ్ళపల్లి , కేకే2,  ఎర్రగుంట పల్లె , రేపో మాపో ఇందారం, నెన్నెల , చెన్నూర్ మండలల్లో  ఓపెనకాస్ట్ ప్రారంభం కానుంది.కుమ్రం భీం  ఆసిఫాబాద్ లో నడుస్తున్న  ఆసియాలో అతి పెద్ద ఓపెన్ కాస్ట్  డోర్లి, కైరిగూడ తో  పాటు రేపో మాపో ఆసిఫాబాద్ , వాంకిడి , కెరమేరి ప్రారంభం కానుంది. అదిలాబాద్ ( ప్రస్తుత మంచిర్యాల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ ) ,  కరీంనగర్ (ప్రస్తుతం పెద్దపల్లి, భూపాల్ పల్లి ), వరంగల్ (ప్రస్తుతం భూపాల్ పల్లి)  , ఖమ్మం ( ప్రస్తుత ఖమ్మం , కొత్తగూడెం ) జిల్లాలల్లో లక్ష ఎకరాల పైన 800 గ్రామా లను ముంచి పది లక్షల మందిని నిర్వాసితులని చేస్తూ ఉత్తర తెలంగాణ ని బొంధల గడ్డగా మార్చిన ఓపెన్ కాస్ట్ గురించి ఏ ఒక్క సెలబ్రిటీ గొంతు ఎత్తరు ఎందుకు..?? ఏ రాజకీయ  పార్టీ నాయకుడు మాట్లాడడు..?? గత ఆరు సంవత్సరాలుగా ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకంటే మా నేలల , బతుకుల నాశనం వల్లనే కదా , మా బ్రతుకుల్లో బొగ్గు పోసి మీకు హైదరాబాద్ మహా నగరంలో 24 గం.లు కరెంట్ , ఏ / సీలు. సకల సౌకర్యాలు . మా భూములు పోయి , గోదావరి ఒడ్డున ఉండి మురికి నీల్లు తాగుతుంటే , మా గొంతులు బిగించి, మా దగ్గరి దోపిడి చెంచాలకి ఆస్తులు , అధికారమిచ్చి, మేం మునిగితేనే  మా ఎల్లంపల్లి నీల్లు ఎత్తుకపోయి సిద్దిపేటలో రిజర్వ్ చేసుకోని , గోదావరి పొడుగూత మరియు హైదరాబాద్  చుట్టుపక్కలా కంపెనీలకు , ఫ్యాక్టరీలకు మా నీల్లు దోపిడి చేసి బ్రతికేది మీరే కదా ? ఎట్లాగు ఆయింత దోచుకునే ప్రాంతమనే కదా మాకు కనీసం ఒక యూనివర్సిటి ఏర్పాటు చేయనిది ? దీనిపై ఒక్కరు మాట్లాడరేమి?
ఈ ప్రాంతంలో ఓపెనకాస్ట్ ల వలన అనేక సమూహాలుగా ఉంటున్న  ప్రజలు గోండులు, నాయకపోడ్,ఆదివాసీలు ,అనేక సబ్బండ వర్గాల ప్రజలు  తమ వ్యవసాయ భూముల్ని  ఓపెనకాస్ట్ కింద కోల్పోయి జీవనాధారాన్ని కోల్పోతున్నారు .గ్రామాలకు గ్రామాలు దాదాపు వందల సంఖ్యలో గ్రామాలు నేడు ఓపెనకాస్ట్ల పుణ్యమా అని కనుమరుగై కాగితాల రూపంలో మిగులుతున్నాయి. మనం గూగుల్ మ్యాప్స్ లో  ఈ ప్రాంతాలలో ఓపెనకాస్ట్ లకి సంబంధించిన చిత్రాలని చూస్తే తెలుస్తుంది.ఆకు పచ్చని నేలని వేల హెక్టార్లలోి నాశనం చేస్తూ బొందల గడ్డలుగా, మట్టి కుప్పలుగా దర్శనం ఇస్తున్నాయి.ఈ ప్రాంతాలలో విస్తరించిన అడవులు,జంతుజాలం నాశనం అవుతూ వస్తున్నాయి.  గ్రామాల్లో వ్యవసాయం, కులవృత్తులు,చెరువులు,కాలువలు  కనిపించకుండా పోతున్నాయి.ఓబీ( ఓపెనకాస్ట్ నుండి వెలికి తీసిన మట్టి) కుప్పలు గ్రామాలలో పొలాలను మింగుతూ గోదావరి నదిని సమీపిస్తున్నాయి.ఈ మహా విధ్వంసం మీకు కనిపించట్లేదా మహాశయులారా ? 
అట్లాగే ఈ ప్రాంతంలో  ” టైగర్ జోన్ “పేరుతో  ఆదివాసీ గూడేలని మైదాన ప్రాంతాలలోకి తరలించి వారి సంస్కృతిని, వారి జీవన విధానాన్ని విచ్చిన్నం చేసే కుట్రల గురించి , మన రాజకీయ నాయకులకు ,సినిమా నటులకు,ఉద్యమకారులకు,రచయితలకు,కవులకు తెలియని విషయం కాదు. మరి అడవి బిడ్డలైన గోండు, కోలామ్ , ప్రధానులని అడవి నుండి దూరం చేసి కేవలం జంతువుల కోసం వారి జీవన విధానమును  ద్వసం చేసే చర్యల పట్ల ఎందుకు ఈ ప్రభుత్వం, ఇతర వ్యక్తులు,సంస్థలు, నోరు విప్పి మాట్లాడలేదు
యురేనియం తవ్వకాలకు రెండు సంవస్సరాలకి పూర్వమే రాష్ర్ట ప్రభుత్వం అనుమతి  ఇచ్చింది. దాదాపు 3వేల కి పైగా బోర్లని ఇప్పటి దాకా వేసి వివిధ ప్రయోగాలు చేశారు  , ఆయా ప్రాంతాలలో యురేనియం నిక్షేపాలని గుర్తించారు. పౌరసంఘాలు ,ఆదివాసీ సంఘాలు, రచయితలు కొన్ని రోజులుగా ధర్నాలు ,నల్లమల విద్వాంసం మీద పోరాడుతూనే ఉన్నారు ,కొన్ని రోజులుగా #సేవ్ #నల్లమల  (#save nallamala)హ్యాష్ టాగ్ తో సామాజిక మాధ్యమాల్లో పౌరులు గొంతెత్తుతున్నారు. అప్పటి నుండి ప్రభుత్వం నిరసనకారుల్ని,ఉద్యమకారుల్ని అడ్డుకుంటు వస్తూనే ఉంది, అరెస్టులు చేస్తూనే ఉంది. అంతవరకు బాగానే ఉంది మరి నేడు #సేవ్ నల్లమల పేరుతో ప్రభుత్వంలో ఉన్నవారే స్వయానా ముఖ్యమంత్రి గారి తనయుడు కేటీఆర్ గారు స్పందించడం, ఆయనకి మద్దతుగా ఆయన కుమారుడు tweeet చేయడం , కొంతమంది సినిమా నటులు విజయ్ దేవరకొండ , మంచు మనోజ్ , హీరోయిన్ సమంత , అనసూర్య ,సినీ గేయ రచయిత చంద్రబోస్ , పవన్కళ్యాన్ జనసేన పార్టీ నుండి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అయితే ఏకంగా పత్రికలకు నల్లమలని కాపాడాలని వ్యాసం రాయడం, దేశపతి శ్రీనివాస్ లాంటి వారు కూడా సొంత ప్రభుత్వంలో ఉండి  యురేనియం తవ్వకాలను వ్యతిరేకించడం ?? అంటే వీరికి ముందే తెలియదా..?? తెలిసిన ఇంతకాలం సైలెంట్ గా ఉండి ఇప్పుడు సేవ్ నల్లమల అని ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం … అనేక ప్రశ్నలని లేవనెత్తుతుంది.  మరి కేంద్రం ప్రాజెక్టు అయినా రాష్ర్టప్రభుత్వ అంగీకారంతోనే కదా…?  కేంద్రం ముందడుగు వేసేది.. మరి యురేనియం ప్రాజెక్టు పేరుతో కేంద్రాన్ని బలిచేయాలని తమతప్పు ఏమీ లేదని  రాష్ట్ర ప్రభుత్వం  చెప్పుకోవడం కోసమేనా.?? ప్రభుత్వ పెద్దలు ఈ కృత్రిమ నాటకంను ఆడుతున్నరా..??లక్షలాది ఎకరాలు వేయికి దగ్గరగా ఊర్లు , పది లక్షల మంది జనం , దాదాపు పూర్వపు ఒక జిల్లా , దాని ప్రభావంతో ఉత్తర తెలంగాణ మొత్తం నాశనం అవుతుంటే మాట్లాడని గొంతులు …, ఇవ్వాళ ఇరవై వేల ఎకరాల అడవి కోసం, కొంత మంది చెంచుల కోసం మాట్లాడుతుంది నిజాయితితోనేనా? కాదు కాదు.1.  ఎలాగు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడితే ఏమనేలా లేదనే దైర్యం. 2. ఉత్తర తెలంగాణ దోపిడి తమకు సకల సౌకర్యాలని ఇస్తే , నల్లమల దోపిడి హైదరాబాద్ లో ఉండే తమకు అనేక ఆరోగ్య సమస్యలని, ఇబ్బందులని తెస్తదని భయం. అందుకే మీ నటనావేశాలు . కేవలం హైదరాబాద్ వాసులకి నీటి కాలుష్యం కోసమేనా..?ఎక్కడో హైదరాబాద్ దగ్గర ఉందని కృష్ణా జలాలు నాశనం అని  ఏసీ రూముల్లో కూర్చొని మాట్లాడే  రచయితలు,కవులు, సెలెబ్రెటీలు,రాజకీయ నాయకులు , పౌర సంఘాలకు ఓపెనకాస్ట్ వలన  ఉత్తర తెలంగాణతో పాటు ఖమ్మం,వరంగల్ జిల్లాలు దాదాపు సగం కన్నా ఎక్కువ భాగమే విధ్వంసానికి  గురవుతున్న  ఎందుకు నోరు విప్పి ఇప్పటి దాకా మాట్లాడలేదు ..ఎందుకు..?వారికి ఉత్తర తెలంగాణ ప్రాంతం  పట్ల  ,ప్రజల పట్ల ప్రేమ లేదా..?ఎన్నికల కోసమా.? వారి స్వలాభం కోసమా..?  అనేది తేలాల్సిఉంది.
ప్రకృతి ఎక్కడైనా నాశనం అవుతుంటే స్పందించాలి అది  నల్లమల అయినా ఒకే ఇందారం ఓపెనకాస్ట్ అయినా సరే.. అయితే ఇక్కడ  అతి ఎక్కువ స్థాయిలో  వేల ఎకరాల్లో ఓపెనకాస్ట్ గనుల వలన విధ్వంసం , వేలాది గ్రామాలు ,వ్యవసాయం దెబ్బతిని, లక్షల సంఖ్యలో ప్రజలు జీవనాధారాన్ని  కోల్పోతుంటే ఎందుకు  స్పందించడం లేదనే అనుమానం  ఉత్పన్నం అవుతుంది.  
ఒక సమస్యని ఒకలా..? ఇంకో సమస్యని ఒకలా చూడటంలో  ప్రభుత్వ0,సంస్థలు ,సినిమా నటులు,రచయితల అభిప్రాయాలని  పరిశీలిస్తే  ఇది రాజ్యం కుట్రలో భాగమా..?? లేక ప్రకృతి పట్ల ప్రేమనా ..??హైదరాబాద్ కేంద్రంగా కృత్రిమ ఉద్యమమా.?? మొదట యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చి నేడు తమకి సంబంధం లేదని కేంద్రం కుట్ర అని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసి తెలంగాణ ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నంలో భాగమా..?నల్లమల పట్ల ప్రేమ చూపెట్టే వారికి,ఉద్యమాలు చేసే వారికి , యావత్ తెలంగాణాతో పాటు సగం దేశానికి  కరెంటు ఉత్పత్తి కోసం తమ విలువైన భూముల్ని, గ్రామలని,సంస్కృతీని కోల్పోయిన లక్షలాది ప్రజల అంధకార జీవితాలు పట్టవా..??వీరి పట్ల వివక్ష ఎందుకు..?? 
నల్లమలలో యురేనియం తవ్వకాలని వ్యతిరేకిస్తూనే ఉత్తర తెలంగాణ తల్లి గోదావరిని గొంతు కోసి,అనేక గ్రామాలని, అడవులను, వేలాది జాతుల,సమూహాలని నిర్వీర్యం చేసే ,ప్రకృతికి విరుద్ధంగా పర్యావరణాన్ని నాశనం చేసే  ఓపెనకాస్ట్ గనుల మీద కూడా ప్రభుత్వం ,సెలెబ్రిటీలు,సినిమాతారలు స్పందించాలని ,గొంతెత్తుతారని విశ్వసిస్తున్నాను.
#save #telangana 
నాగేంద్ర బొలిశెట్టి (ఓపెన్ కాస్ట్ ల మూలాన కనుమరుగై పోయిన గ్రామాలను చూసిన సాక్షిగా )ఫోన్.7799349934మంచిర్యాల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here