కరోనా మహమ్మారిని అరికట్టే ప్రక్రియలో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా గతేడాది మార్చి నుండి నిలిపివేసిన MMTS రైళ్ళను తిరిగి ప్రారంభించాల్సిన అవసరముందని, MMTS రైళ్ళు పున:ప్రారంభం కాని కారణంగా.. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంత ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి శ్రీ కే.చంద్రశేఖర్ రావుకు రాసిన లేఖలో కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ప్రస్తావించారు.
50 కిలోమీటర్ల దూరాన్ని అనుసంధానం చేస్తున్న ఫలక్నామా-లింగంపల్లి, నాంపల్లి- ఫలక్నామా, నాంపల్లి- లింగంపల్లి లాంటి ప్రధాన రూట్ల మధ్య 25 స్టేషన్లను కలుపుతూ రోజూ 121 ట్రిప్పులు నడిచే MMTS రైళ్లు కోవిడ్ నిబంధనల కారణంగా గత మార్చి నుండి ఆగిపోయిన విషయం తెలిసినదే. అతి తక్కువ చార్జీలతో సౌకర్యవంతంగా, వేగవంతంగా గమ్య స్థానాలకు ప్రయాణీకులను చేరవేసే MMTS రైళ్లు ఇంకా ప్రారంభం కాకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఈ సందర్భంగా శ్రీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ముఖ్యంగా విద్యార్ధులు, ఉద్యోగులు, కార్మికులు, చిరు వ్యాపారులు MMTS ద్వారా చాలా తక్కువ చార్జీలతో తమ ప్రయాణాన్ని కొనసాగించే మధ్యతరగతి, పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, మంత్రి అన్నారు.
కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ సాధారణ పరిస్థితులు నెలకొంటున్న సమయంలో.. హైదరాబాదులో మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాలు తిరుగుతున్న నేపథ్యంలో MMTS రైళ్ళను వెంటనే నడపేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున రైల్వే శాఖను కోరాలని ముఖ్యమంత్రికి శ్రీ కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలోనూ లోకల్ రైళ్ళను అక్కడి రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ నడిపిస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి ప్రస్తావించారు.
ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. కరోనాపై ప్రభుత్వం, వైద్య నిపుణులు సూచించిన నిబందనలను పాటిస్తూ MMTS రైళ్ళు నడిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని రైల్వేశాఖతో ఈ విషయంపై వెంటనే చర్చించాలని శ్రీ కిషన్ రెడ్డి కోరారు.
