తెలంగాణ సమాంతర సినిమాకు మల్లేశం ఒక యంత్రం

0
180

అస‌లు క‌థ మొద‌లైంది ఇప్పుడే సిన్మా ప‌క్కా సూడుమ‌ని ప‌తొక్క‌రికి జెప్పుడే
టాకీస్ల సిన్మా సూశ్నోళ్ల‌కి క‌న్నుల పండుగ‌ ఇసొంటి సిన్మాలు ఇంకిన్ని రావాల‌ని కోరుకుంటున్నం మ‌న్సు నిండుగ‌ ఎన్నో ప్ర‌యోగాలు చేసి మిషిన్ జేశ్న మ‌ల్లేశం సైంటిస్ట్ అయితే.. ఇలాంటి స్టోరీతో తెలుగు సినీ చ‌రిత్ర‌లో స‌రికొత్త ప్ర‌యోగం చేసిన‌ సెల్యులాయిడ్ సైంటిస్ట్ డైరెక్ట‌ర్ రాజ్ గారు.
క‌ష్టసుఖాలు, గెలుపోట‌ములు ప‌డుగు పేక‌ల్లాంటివ‌ని, అవి క‌లిస్తేనే జీవితం అందంగా ఉంటుంద‌ని గుర్తుచేసి వెండితెర‌ని ప‌సిడి ప‌ట్టుచీర‌గా మ‌ల‌చిన రాజ్ గారికి హ్యాట్సాఫ్‌.

మ‌ల్లేశం.. సిల్వ‌ర్ స్క్రీన్ పై పేరు ప‌డ‌గానే.. ఎంత మాయ గ‌ల్ల‌దీ బట్ట.. బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ తో నేత‌న్న‌ల క‌ష్టాన్ని చూస్తూ సినిమాలో ఇన్‌వాల్వ్ అవుతాం. నేత కార్మికుడిగా మ‌ల్లేశం న‌వ్వితే మ‌నం ఖుషీ అయిన‌ట్ట‌నిపిస్త‌ది. మ‌ల్లేశంకి బాధొస్తే మ‌న‌ కళ్ల‌ల్ల నీళ్లు తిర్గిన‌ట్ట‌నిపిస్త‌ది. అనుకున్న‌ది సాధిస్తే మ‌న‌కి మ‌నమే అలాయ్ బ‌లాయ్ ఇచ్చుకున్న‌ట్ట‌నిపిస్త‌ది. అలా ఫ‌స్ట్ ఫ్రేమ్ నుండి ఎండ్ టైటిల్స్ వ‌ర‌కూ ప్రేక్ష‌కుల్నిక‌నెక్ట్ అయేలా చేయ‌డంలో డైరెక్ట‌ర్ అండ్ మూవీ టీమ్ స‌క్సెస‌య్యారు.

తెలంగాణ యాస‌ని, భాష‌ని, సంస్కృతిని, సాంప్ర‌దాయాల్ని, పండ్గ‌ల్ని, ప‌రాష్కాల్ని అన్నిటిని ఒక్క సినిమాలో చూయించారు.

దూలె దూలెరా కాసిమా.. దుమ్ములేప‌రా కాసిమా ఏమేమి గావాలి సామికి.. న‌ల్ల‌గొండ మౌలాలికి అని గోరేటి వెంక‌న్న గొంతెత్తి పాడుతుంటే మ‌న సంస్కృతిలో భాగ‌మ‌యిన పీర్ల పండ‌గ‌ని మొద‌టి సారి సిల్వ‌ర్ స్క్రీన్ పై ఇంత గొప్ప‌గా చూపించారు.. ఇంకేం కావాలిరా బై.. అని సీట్ల‌లోంచి లేశి దులా ఆడి దుంక‌బుద్ధ‌యిత‌ది. మ‌న్సుల మ‌లిద‌ ముద్ద‌లు యాదికొచ్చి నోట్లె ఊరిలొచ్చిన‌ట్ట‌నిపిస్త‌ది.
ఇలా ఒక్క‌ట‌నే కాదు.. సినిమాలో ప్ర‌తి పాట అద్భుత‌మే.

పెద్దింటి అశోక్ కుమార్ గారి మాట‌ల గురించి ఎన్ని మాట‌లు రాసినా త‌క్కువే. పంచులు, ప్రాస‌లు, అగ్రెసివ్ అండ్‌ డబుల్ మీనింగ్ డైలాగులు రాస్తెనే ఆడియెన్స్ ఎంట‌ర్‌టెయిన్ అవుతారు అన్న బాక్సాఫీస్‌ఫార్ములాని బాజాప్త‌ పూర్తిగా తుడిచిపెట్టారు. స‌హ‌జ‌మైన‌ సంభాష‌ణ‌ల్తో అచ్చ‌మైన తెలంగాణ సామెత‌ల‌తో యాస‌లోని మాధుర్యాన్ని మరోసారి గుర్తుచేశారు.

ఝాన్సీ గారు, తండ్రిపాత్ర‌లో న‌టించిన చ‌క్ర‌పాణి గారి సీన్స్ చూస్తుంటే.. సినిమాటిక్ గా కాదు.. నేత కార్మికుల సెల్ఫీ వీడియో చూసిన‌ట్ట‌నిపిస్త‌ది.
టైటిల్ రోల్ పోషించిన ప్రియ‌దర్శి గురించి ఎంతని చెప్పాలి? నాన్న చెక్క ఆసు మిషిన్‌ని త‌గ‌ల‌బెట్టిన సీన్ లో ద‌ర్శి యాక్టింగ్, ఆ త‌ర్వాత‌ క్ల‌యిమాక్స్‌లో బ‌స్సులో నుంచి గెంటేస్తే వ‌ర్షంలో న‌డిరోడ్డుపై కూర్చోని బాధ‌ప‌డే సీన్‌, ఆ త‌ర్వాత‌.. అమ్మో వ‌ద్దు.. చెప్ప‌టం క‌న్నా అత‌ని న‌ట‌న‌ని స్క్రీన్ పై చూడ్డ‌మే క‌రెక్ట్‌. కండ‌ల హీరోల చుట్టే క‌థ‌లు తిరుగుత‌న్న త‌రుణంలో కండెల‌తో చీర నేసే అస‌లైన హీరో నేత‌న్న పాత్రతో న‌టుడిగా మ‌రో మెట్టెక్కాడు.

హీరోయిన్ అన‌న్య‌.. డెబ్యూ మూవీ అయినా చాలాసార్లు ప్రియ‌ద‌ర్శితో పోటీప‌డి న‌టించిన‌ట్టనిపించింది. ఫుల్ లెంగ్త్ మూవీలో అచ్చ‌మైన తెలంగాణ యాస మాట్లాడిన హీరోయిన్‌ని చూస్తుంటే ఎంత ముచ్చ‌టేసిందో. మరీ ముఖ్యంగా పెళ్ల‌యి అత్త‌గారింటికి రాగానే ఆడ‌ప‌డుచు పేరు చెప్పాల‌న్న సీన్లో… తుప్ప‌ర తుప్ప‌ర వాన పాటతో యాక్ట్రెస్‌గా త‌న బ్రిలియ‌న్స్‌ని ప్రూవ్ చేసుకుంది. డ‌బ్బింగ్‌లో మేనేజ్ చేసే చాన్స్ లేకుండా సింక్ సౌండ్ టెక్నాల‌జీకి యాప్ట్ అయేలా అంత బాగా పాడడం చిన్న విషయం కాదు.

న‌టుడిగా ఏలె ల‌క్ష్మ‌ణ్ గారు స్క్రీన్ పై క‌నిపించింది నాలుగ‌యిదు సీన్లే అయినా, ఆర్టిస్ట్‌గా బిహైండ్ ద స్క్రీన్ ఆయ‌న మార్క్ దాదాపుప్ర‌తీ సీన్‌లోనూ క‌నిపిస్తుంది.

ఇక ప్రియ‌ద‌ర్శికి స్నేహితులుగా న‌టించిన జ‌గ‌దీష్‌, అన్వేష్‌ల గురించి ప్ర‌తిఒక్క‌రూ మాట్లాడుకుంటారు. పెళ్లిచూపులు మూవీలో హీరో ఫ్రెండ్‌గా న‌టించిన ప్రియ‌ద‌ర్శికి ఎలా బ్రేకొచ్చిందో.. ఈ సినిమాలో దర్శికి ఫ్రెండ్స్‌గా చేసిన ఇద్ద‌రికీ ఆ రేంజ్ క్రేజ్ వ‌స్తుంది.
ఒక్క‌ర‌ని కాదు.. సినిమాకి వ‌ర్క్ చేసిన ప్ర‌తి ఒక్క‌రూ ప్రాణం పెట్టి మ‌ల్లేశం ఆత్మ‌ను ఆవిష్క‌రించారు.

గాయ‌ప‌డిన క‌వి గుండెల‌లో రాయ‌బ‌డని కావ్యాలెన్నో..
ఓడి పోరాడి గెలిచిన మ‌ల్లేశం లాంటి నిజ‌హీరోల మీద తీయ‌బ‌డని సినిమాలింకెన్నో..
ఈ సినిమా ప్ర‌భావంతో కంచికి చేరేందుకు సిద్ధ‌మై బండెక్కిన అలాంటి క‌థ‌ల‌న్నీ వెండితెర‌కెక్కాలని కోరుకుంటూ..

పీఎస్‌: అంత‌ మంచిగ‌నే ఉంది గ‌ని.. మ‌ల్లేశం సూశ్నంక మ‌న్సుల ఒక‌టే రంది వ‌ట్కున్న‌ది. నిజంగ మ‌ల్ల‌మ‌ల్ల‌ మల్లేశం అసొంటి మంచి సిన్మ‌లొస్త‌యా.. లింగ‌వ్వా.. జెర నువ్వే అల్లువ‌ట్టి జెప్పాలె. పున్నెముంట‌ది.

రివ్యూ బై: Murali Sarkar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here