మోసగాళ్ళ భారిన పడకండి :కువైట్ రాయభార కార్యాలయం

0
580

కువైట్: అవకాశం కోసం ఎదురుచూస్తూ మోసగాళ్లు చుట్టూ పొంచి ఉన్నారని, వారి బారిన పడకుండా భారతీయులు జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతూ కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. విదేశాల్లోని భారతీయులు మోసగాళ్ల బారినపడి ఇక్కట్ల పాలవుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో స్పందించిన ఇండియన్ ఎంబసీ ఈ మేరకు కొన్ని జాగ్రత్తలు సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం..
ఇమ్మిగ్రేషన్ పేపర్లలో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు మీకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోందంటూ మోసగాళ్లు ఫోన్ చేస్తారు. అదే కనుక జరిగితే అరెస్ట్ కానీ దేశం నుంచి బహిష్కరించడం కానీ జరుగుతుందని భయపెడతారు. దీనినుంచి బయటపడాలంటే భారత రాయబార కార్యాలయం నియమించిన లాయర్/అధికారికి కొంతమొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని చెబుతారు. తదుపరి చర్యలు నిలిపివేయాలంటే వెంటనే డబ్బులు పంపించాలని భయపెడతారు. ఒకవేళ బాధితులు తెలివిగా వ్యవహరించి తాము ఎంబసీకే వచ్చి చెల్లిస్తానని చెబితే.. తాము ఎంబసీ నుంచే ఫోన్ చేస్తున్నామని చెబుతూ ముందే సేకరించిన వారి వివరాలను చెబుతారు. దీంతో తప్పని పరిస్థితుల్లో కొందరు, భయపడి మరికొందరు మోసగాళ్ల బారినపడి తీవ్రంగా నష్టపోతున్నారు.
కాబట్టి మోసగాళ్ల నుంచి వచ్చే ఇటువంటి ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని, ఒకవేళ ఎవరైనా ఫోన్ చేస్తే ఆ విషయాన్ని వెంటనే రాయబార కార్యాలయ అధికారులకు సమాచారం అందించాలని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. http://www.indembkwt.org వెబ్‌సైట్‌లో కార్యాలయ ఫోన్ నంబర్లు ఉన్నాయని వివరించింది. సమాచారమిస్తే మోసగాళ్లపై సత్వర చర్యలు తీసుకుంటామని పేర్కొంది

Author:Gangadhar patel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here