కొబ్బరి మట్ట : సృజనాత్మకత,విమర్శనాత్మక తో కూడిన పేరడీ కథ

0
2701

ఈ సినిమా రివ్యూ రాసే ముందు 5 ఏళ్ల క్రీతం నేను పనిచేసిన సాఫ్ట్ వెర్ కంపెనీ లో జరిగిన సంఘటన గురుంచి చెప్పాలి. ప్రతి కంపెనీ లో ఒక ఎంటర్టైన్మెంట్ టీమ్ ఉంటుంది.వీరు మాములు రోజుల్లో అందరిలాగా పనిచేస్తూ ఏదైనా కంపెనీ వేడుకలు జరిగినపుడు డాన్సులు ,ఫ్లాష్ మాబ్ లు ,స్కిట్ లు ,మ్యూజిక్ బ్యాండ్ లతో తమకున్న ఎక్సట్రా స్కిల్స్ తో కంపెనీలో సెలెబ్రిటీలుగా వెలుగుతుంటారు. పేరుకు సాఫ్ట్ వెర్ ఉద్యోగులే అయినా కూడా వీరు టాలెంట్ లో సినిమా ఆర్టిస్టులకు తగ్గకుండా ఇరగదీస్తుంటారు. వీరు కంపెనీల వేడుకలకు సంబంధం లేకుండా ఒక గ్రూప్ గా ఏర్పడి ఖాళీ సమయంలో షార్ట్ ఫిల్ములు తీస్తూ , టాప్ స్టార్ హీరోల కొత్త సినిమా విడుదల అయితే ఐమాక్స్ లో మొదటి రోజు మొదటి షో 50 మంది బల్క్ గా బుక్ చేసుకొని అల్లరి అల్లరి చేస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆ రోజు ఆఫీస్ లో ఉద్యోగులతో సినిమా విశేషాలను పిచ్చాపాటీ మాట్లాడుతూ రివ్యూ లు ఇచ్చేవారు. కాని ఒక వారం మాత్రం ఇమేజ్ ఉన్న హీరోల సినిమా విడుదల లేకపోయినా కూడా దాదాపు 100 మంది ఉద్యోగులు ఒక చిన్న సినిమా కు బుక్ చేసుకోవటంతో కంపెనీలో మిగతా వారు విచిత్రంగా చూసారు. దానిక్కారణం దాంట్లో హీరో సంపూర్ణేష్ బాబు. సినిమా హృదయకాలేయం. కమెడియన్ గా సంపూ లాంటి వ్యక్తి సినిమా టీవీల్లో వస్తే కూడా ఛానల్ మార్చుతాం అలాంటిది ఐమాక్స్ లో 100 టిక్కెట్లు బుక్ చేయటం ఏంటి డబ్బులు దండగ. ఆ డబ్బులను కనీసం చారిటి కి ఇస్తే కొందరి జీవితాలు మారుతాయి అని చాలా మంది ఈ 100 మందిని విచిత్రంగా చూడటం మొదలుపెట్టారు. కాని సినిమా విడుదల అయ్యాకా మాత్రం ఆ సినిమాకు మంచి క్రేజీ వచ్చింది. ఎవరైతే విమర్శలు చేశారో వాళ్లే ఆ సినిమా చూసి మెచ్చుకున్నారు. ఆ సినిమా సక్సెస్ కి,సంపూకు వచ్చిన ఇమేజ్ కి కారణం తెలుసుకోవటానికి అని నేను కూడా చూడటం జరిగింది.చూసాక అర్థం అయింది ఏంటంటే మూస పద్దతిలో 6 పాటలు (ఒక ఐటెం సాంగ్ ,ఒక బిల్డ్ అప్ సాంగ్),10 బిల్డ్ అప్ సీన్లు ,4 ఫైట్స్, 3 సెంటిమెంటల్ సీన్లు ,కామెడీ సీన్లతో స్టార్ హీరోల సిన్మాలు 25 ఏళ్లుగా ఒకే పద్దతిలో వెళ్తున్న సినిమాలకు ఒక చెంప పెట్టు అని . హీరోకి గ్లామర్ లేకపోయినా ,6 అడుగులు లేకపోయినా ,6 ప్యాక్ బాడీ లేకపోయినా కూడా మిగతా స్టార్ హీరోలకు దీటుగా బ్రేక్ డాన్సులు , భారీ ఫైట్లు ,భారీ డైలాగులు చెప్పి లాజిక్స్ లేకుండా సినిమా తీయొచ్చని నిరూపించిన సినిమా అది. వారాంతం వస్తే హాలీవుడ్ సినిమాలు చూస్తూ ఉండే సాఫ్ట్ వెర్ జనాలు 30 ఏళ్లుగా తెలుగు జనాలను ఒక ఇమేజ్ చట్రంలోకి తోసేసిన స్టార్ హీరో లకు వారి దర్శకులకు సంపూని ఆదరించటం వల్ల ఈ తరం ప్రేక్షకులు స్టార్ హీరోలకు ,దర్శకులకు ,వాటిని ఆదరించే ప్రేక్షకులకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్లు అయింది. కట్ చేస్తే సంపూ ఒక స్టార్ అయిపోయాడు.

సరిగ్గా 5 ఏళ్ల తర్వాత అదే కాంబినేషన్ లో కొబ్బరిమట్ట అనే సినిమా విడుదల అవుతుంది అన్నప్పుడు మొదటి సినిమా ఎదో ఆక్సిడెంటల్ గా హిట్ అయింది అదే కోవలో ,రెండవ సినిమా హిట్ అవుతుందా ? స్టీవెన్ శంకర్ కి ఏమైనా పిచ్చా సంపూలాంటి హీరోతో భారీ బడ్జెట్ సినిమా తీయటం ఏంటి?అది కూడా బాహుబలి లాగా 4 ఏళ్ళు షూట్ చేసే సాహసం చేయటం ఏంటి ? అనే ప్రశ్నలు ప్రేక్షకుల మదిలో చక్కర్లు కొట్టాయి. సంపూ భారీ డైలాగులు,పాటలు ,ట్రైలర్ ల స్పందన సినిమా విడుదల ముందు అంచనాలు పెంచేసాయి. మరి సినిమా ఎలా ఉందొ చూద్దాం పదండి.

ఇది స్పూఫ్ కావడం వల్ల కథ తెలిసిందే. పెదరాయుడు ,మా అన్నయ్య ,సంక్రాంతి సినిమాలను మిక్సీలో వేస్తూ కొత్త కథ తయారుచేశారు స్టీవెన్. కాని అయన సృజనాత్మకతతో రివర్స్ స్క్రీన్ ప్లే రాసుకుంటూ లాజిక్ లేని సీన్లతో కామెడీతో నింపేసాడు. ప్రధానంగా బ్రష్ షేరింగ్ సన్నివేశం ,తమ్ముళ్లకు వాతలు పెట్టె సన్నివేశం ,ఒక తమ్ముడు తప్పు చేస్తే మిగతా తమ్ముళ్లను కొడుతూ తన అసహనత ను ప్రదర్శించటం ,పెదరాయుడు ఇంట్రడక్షన్ సన్నివేశంలో ఊరి ప్రజలు పెదరాయుడు లేవకుండా ఏం పనిచేయరు అనే కాన్సెప్ట్ ని పొట్టలు చెక్కలు అయ్యేలా తయారుచేశారు. షకీలా కత్తి మహేష్ ల హనీమూన్ సన్నివేశం కొత్తగా ఉంటుంది.

పాత్రలు నటుల సంగతికొస్తే పెదరాయుడు ,పాపారాయుడు ,ఆండ్రాయుడు లాంటి పాత్రల సృష్టికరణ అమోఘం. పెదరాయుడు భర్య చనిపోయేముందు సెంటిమెంటల్ సాంగ్ బదులు డ్యూయెట్ సాంగ్ పెట్టడం,పాపారాయుడు చనిపోయేముందు తన భార్యను చంపటం లాంటివి స్టీవెన్ సృజనాత్మకతకు నిదర్శనాలు. పాపారాయుడు పెదరాయుడు లు ఊళ్ళో పెళ్లి కాని అమ్మాయిలకు ఎలా ఉపాధి ఇస్తారో నవ్వులు తెప్పిస్తుంది.ఈ పాత్రల్లో సంపూ విభిన్న కోణాలు చూయించాడు. మహాభారతంలో కుంతి పాత్రను షకీలా పాత్రకు ఆపాదించిటం నవ్వులు తెప్పిస్తుంది.కత్తి మహేష్ పాత్ర సంక్రాతి సినిమాలో సుధాకర్ పాత్రను తెస్తాడు. రంగస్థలం నాగ మహేష్ పాత్రతో తన కూతురు గురించి చెప్పటం విచిత్రంగా ఉంటుంది.పెదరాయుడు ఎంత మంది భార్యలను పెళ్లి చేసుకున్న కూడా సాదరంగా ఆహ్వానించే భార్య పాత్రలో గాయత్రీ గుప్తా ఒదిగిపోయింది. పాపారాయుడు భార్యగా అర్జున్ రెడ్డి ఫేమ్ సుధా రెడ్డి పాత్ర కు తగ్గట్టు చేసింది. పెదరాయుడు తమ్ముళ్ల పాత్రలో అందరూ బాగా చేశారు. పాత పెదరాయుడు సినిమాలో ఎంఎస్ నారాయణ పాత్రలో ప్రముఖ సినీ పిఆర్ఓ ఏలూరు శీను అక్కడక్కడా కనిపించినా కూడా కాయలు పిందలు అనే డైలాగ్ తో నవ్విస్తాడు.

ఈ సినిమాకు కర్త కర్మ క్రియ ఎవరంటే నిర్మాత రచయిత సాయి రాజేష్ (స్టీవెన్ శంకర్ )అనే చెప్పాలి. దర్శకుడు కూడా తన టేకింగ్ తో శబాష్ అనిపించాడు. పాటలు ,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. ముక్యంగా టైటిల్ సాంగ్ ,ఆ ఆ సాంగుల నేపథ్యం బాగుంది. తెలిసిన కథ కావటం వల్ల సినిమా చూసేటప్పుడు కొంచెం స్లో అనిపించినా కూడా ఆ అంశాన్ని కామెడీ డామినేట్ చేస్తుంది. చివరగా 4 మన రొటీన్ తెలుగు సినిమాల మీద ప్యారడీ కోసం సంపూ చేసే విన్యాసాల కోసం చూడాలనుకుంటే మాత్రం ఈ వీకెండ్ టైం పాస్ సినిమాగా కొబ్బరిమట్ట చూడొచ్చు.

రేటింగ్ : 3/5

Ravinder Ryada

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here