సాంబశివ కన్నంవార్ – మహారాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి , మన తెలంగాణ ముద్దుబిడ్డ

0
17

తెలంగాణ ముద్దుబిడ్డ స్వాతంత్ర సమరయోధులు మహా రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి “మరోట్రో సాంబశివ కన్నంవార్” 120 వ జయంతి సందర్భంగా (“జనవరి 10”)

 M.S. కన్నంవార్ తెలంగాణలోని కరీంనగర్ జిల్లా నుండి ముంబై వలస వెళ్లిన రైతు కుటుంబంలో జనవరి 10 ,1900  సంవత్సరం లో చాంద్ జిల్లాలో జన్మించారు. వీరు చిన్నతనంలో కటిక పేదరికం అనుభవించి ఉన్నత విద్యను చదవడానికి అనేక ఇబ్బందులు పడి ఉన్నత స్థానానికి వెళ్లారు.విద్యార్థిగా ఉన్నప్పుడే స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొనేవారు.క్విట్ ఇండియా(1942) ఉద్యమంలో పాల్గొని 1942నుండి 1945 సంవత్సరాల వరకు జైలు జీవితం గడిపారు. వీరు 1939 సంవత్సరం నుండి 1948 సంవత్సరం వరకు నాగపూర్ ప్రాంత కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా పనిచేశారు. విద్యా,పత్రికా రంగంలో ఉన్నత స్థాయికి చేరుకొని 1933 వ సంవత్సరంలో బొంబాయిలో ఇప్పుడు గాంధీ విద్యాలయం అనబడు నవ భారత విద్యాలయం ను స్థాపించారు. లోక్ సేవక్ ,నవ సందేశ్, గ్రామ సేవక్ మరియు పంచాయతీ రాజ్ మొదలైన పత్రికలకు ఎడిటర్ గా పనిచేశారు .వీరు ఈ పత్రికల ద్వారా గాంధీ సిద్ధాంతాలను మరియు జాతీయ భావాలను ప్రచారం చేసేవారు .మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడిచి వారిపై అభిమానం తో గాంధీ గారి జీవిత చరిత్ర పై మరాఠీ భాషలో రెండు పుస్తకాలు రాశారు. మరియు మరాఠీ లో రాజమాత జిజియా బాయి అను గ్రంధాన్ని రచించారు.

కన్నంవార్ రాజకీయ జీవితం 

    వీరు 1952 సాధారణ ఎన్నికలలో చాంద్ జిల్లా ముల్ నియోజకవర్గం నుండి ఎన్నికై మధ్యప్రదేశ్ ప్రభుత్వం లో జైల్లు, ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. 1956 లో రాష్ట్రాల పునర్నిర్మాణ తర్వాత బొంబాయి మంత్రిమండలిలో ఆరోగ్య శాఖ మాత్యులు గా పనిచేశారు.1957 లో ముంబై జిల్లా సవోలి నియోజకవర్గం నుండి ముంబై శాసనసభకు ఎన్నికై క్యాబినెట్ మంత్రిగా పని చేశారు .1961 లో మళ్ళీ శాసనసభకు ఎన్నికై 1962 నవంబర్ 20న దేశంలోనే పెద్ద రాష్ట్రాలలో ఒకటైన మహారాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి 1963 నవంబర్ 24న దురదృష్టవశాత్తు పదవిలో ఉండగానే మరణించడం జరిగింది.వీరు కేవలం ఒక సంవత్సరం మాత్రమే ముఖ్యమంత్రి గా పని చేసినప్పటికీ మహారాష్ట్ర లో సంభవించిన అత్యంత క్లిష్ట పరిస్థితులైన పురపాలక సమ్మె, బి.ఇ.ఎన్.టి సిబ్బంది సమ్మె మరియు టాక్సీ డ్రైవర్ ల సమ్మేను ఎదుర్కొని తన ధృడ సంకల్పాన్ని, రాజనీతిజ్ఞతను ప్రదర్శించి చాకచక్యంతో సమస్యలను పరిష్కరించి విమర్శకుల ప్రశంసలు పొందడం జరిగింది.

   తమ లక్ష్యం ఉన్నతంగా ఉంటే ఏమైన సాధించవచ్చునని కన్నంవార్ ని చూసి నేర్చుకోవచ్చు.ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబం నుండి వచ్చి దేశం లో ని అతిపెద్ద రాష్ట్రాలలో ఒకటి అయినా మహారాష్ట్ర  ముఖ్యమంత్రి గా భాద్యతలు నిర్వహించిన కన్నంవార్ జీవితం ఎంతోమందికి మార్గదర్శం.తెలంగాణ ఉద్యమ సమయంలో గౌరవనీయులైన KCR గారు, వి.ప్రకాశ్ వంటి తెలంగాణ మేధావులు ఎన్నో వేదికల మీద వీరి పేరుని ప్రస్తావించి తెలంగాణ ప్రజలు వీరిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పటం జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం వీరి సేవలను గుర్తించి ముంబైలోని ఒక అతిపెద్ద ప్రాంతానికి కన్నంవార్ నగర్ అని నామకరణం చేసింది. ఈ కన్నంవార్ నగర్ భారతదేశంలో నే కాక ఆసియా లోనే అతిపెద్ద కార్మికుల హౌసింగ్ కాలనీ గా పరిగణించబడుతుంది.

      సాసాల మల్లికార్జున్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ,ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోరుట్ల, జగిత్యాల జిల్లా.

  సెల్:- 8328210190

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here