తెలుగు హీరోలకు ఒక హైదరాబాద్ వరద బాధితుడి బహిరంగ లేఖ

0
19533

ప్రియమైన అభిమాన హీరోలకు ,మీ సినిమాలను పిచ్చాపాటిగా చూసే ఒక తెలంగాణ వీరాభిమాని,ఉభయ రాష్ట్రాల కుశలోపరి బాదతో టైపు చేస్తున్న ఒక తీవ్రోత్తమైన ఉత్తరం.

గత 5 రోజులుగా తెలంగాణాలో కురుస్తున్న వర్షాలు ఒక వైపు సంతోషాన్ని ఇస్తే మరో వైపు కొంచెం బాద కల్గిస్తుంది. సంతోషమైన విషయం ఏంటంటే గత 5 ఏళ్లుగా వర్షాలు లేక కరువుతో సాగు నీరు తాగు నీరు లేక అల్లాడిపోతున్న తెలంగాణ సమాజానికి ఈ వర్షాలు సంతోషం తెచ్చి దసరా పండగ ని 20 రోజుల ముందే తెచ్చాయి. 30 ఏళ్లలో పడని వర్షాలు ఈ ఏడులో పడేసరికి తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు,చెరువులు,నదులు,వాగులు నిండు కుండల మారిపోయి తెల్లని మెరుపుతో మెరిసిపోతున్నాయి. బాధ వేసే విషయం ఏంటంటే హైదరాబాద్ లో కుదిపేస్తున్న వరదలు. కొందరు చేసిన తప్పులు,చేస్తున్న తప్పిదాల వలన నాలాంటి చాలా మంది సామాన్య software ఇంజినీర్లు బాధలు పడుతున్నారు. మా తల్లితండ్రులు  కష్టపడి మమ్మల్ని ఇంజినీరింగ్ చదువు చదివించి కస్టపడి క్యాంపస్ సెలక్షన్ లో ఫార్చ్యూన్ -500 కంపెనీలో ఉద్యోగం చేస్తూ మా తల్లి తండ్రులను బాగా చూసుకుంటూ ఊళ్ళో ఉన్న కొంచెం పొలాన్ని అమ్మేసి వచ్చిన డబ్బుతో కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కొని నెల నెల వాయిదాల్లో బ్యాంకుకి డబ్బులు కడుతూ ఊళ్ళల్లో సెలెబ్రెటీ స్టేటస్ మైంటైన్ చేస్తూ కాలాన్ని గడిపేస్తున్నాము. కానీ 5 రోజులుగా మేము అనుభవిస్తున్న నరకం వర్ణనాతీతం. మా ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి.

ఐతే ఈ ఉత్తరం మీకెందుకు రాస్తున్నానే సందేహం రావచ్చు. దానికి ముందు మా కుటుంబ నేపత్యం గురుంచి చెప్తాను. మా తాత కి చదువు లేదు బతుకు తెరువుకి బొంబాయి వెళ్లి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించాడు. అయన కాలంలో తెలంగాణ సినిమాలు చూసే వారు కారు ఎందుకంటే వండటానికి వంట నూనె లేనపుడు మీసానికి సంపంగి నూనె రాసుకోరు కదా. కానీ కళలంటే చాల ఇష్టం దానివలన సింధు బాగోతాలు,బుర్ర కథలు విని తన పని ఒత్తిడిని తగ్గించుకునేవారు. ఎపుడో ఏడాదికి ఒకసారి ఎస్వీయార్,ఎన్టీఆర్ ,ఏఎన్నార్,రాజనాల ,కాంతారావు సినిమాలను చూస్తూ ఆ కథలను ఏడాదిపాటు ముచ్చట్లు పెట్టి కాలక్షేపం చేసేవారు. ఇదే కాలంలో ఆంధ్ర ప్రాంతంలో సినిమాలు బాగా చూసేవారు ఎందుకంటే అక్కడి వ్యక్తిగత ఆర్థిక స్తొమత బాగుండేది కాబట్టి.

ఇక కాలం గిర్రున తిరిగి మా నాన్న జనరేషన్ వచ్చింది.అయన చదువుకునే సమయానికి మా తాత కొంచెం కూడపెట్టాడు. దానివలన తినటానికి డోకా లేదు కాబట్టి మా నాన్న నాటకాల బదులు నెలకో 2 సినిమాలు చూడటం మొదలు పెట్టాడు. చిరంజీవి అంటే పిచ్చి. మా పెదనాన్నకి బాలకృష్ణ పంచె కట్టు అంటే ప్రాణం. మా బాబాయ్ కి నాగార్జున ప్రేమకథలంటే తనకు తాను మైమరచిపోయేవాడు. ఇలా పొట్ట నిండేసరికి మా ఇంట్లో నాటకాల బదులు సినిమాల ముచ్చట్లు ఎక్కువ అయిపోయాయి.
కాలం మళ్ళి గిర్రున తిరిగింది. నేను 10 వ తరగతికి వచ్చేసరికి తొలిప్రేమ సినిమా వచ్చింది. నా 10వ తరగతి మాథ్స్ స్కోర్ 99 ఐతే తొలిప్రేమను థియేటర్లో నేను చూసిన కౌంట్ 100 దాటింది. ఇక తమ్ముడు,బద్రి ,ఖుషి,జల్సా వరకు మొదటి రోజు మొదటి షో చూసేవాడిని ఇక గబ్బర్ సింగ్,అత్తారింటికి దారేది,సర్దార్ ల సమయానికి మంచి ఉద్యోగం చేస్తున్న కాబట్టి ప్రీమియర్ షోలు చూసి మా అభిమానాన్ని చాటుకునేవాడిని. ఇక మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి పోకిరి సినిమా నుంచి మహేష్ బాబుకి పెద్ద అభిమాని గా మరి నాలాగే మొదటి రోజులు చూస్తాడు. మా చెల్లి అల్లు అర్జున్ సినిమాలను క్రమం తప్పకుండా చూస్తుంది. మా పెద్ద నాన్న వాళ్ళ అబ్బాయికి జూనియర్ ఎన్టీఆర్ డైలాగులంటే పిచ్చి. ఇక అది సినిమా వచ్చినపుడు మా బాబాయ్ కొడుకు విజిల్లు వేస్తూ డాన్స్ చేసేవాడు .ఇక శివ సినిమా వచ్చినపుడు మా ఊళ్ళో ని సైకిల్స్ కన్నా సైకిల్ చైన్లకు గిరాకీ ఎక్కువ అయింది. ఇక మా అక్క వాళ్ళ కొడుకు రామ్ చరణ్ డైలాగులు డబ్ స్మాష్ లతో కుమ్మేస్తే ,మా అత్తమ్మ నాగార్జున గారి మీలో ఎవరు కోటీశ్వరుడికి పెద్ద అభిమాని.

ఇలా మా సామాన్య కుటుంబంలో ఒక అజ్ఞాత బంధువుగా మారిపోయారు మీరు.ఒక్కోసారి మా కుటుంబంలో మీ సినిమాల కలెక్షన్స్ గురుంచి,రికార్డుల గురుంచి మాకు మేము గొడవ పడిన సందర్భాలు కోకొల్లలు. రాజమౌళి బాహుబలి తీసినప్పుడు మన తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయి కి వెళ్లిందని సంతోషించాము,గుణశేఖర్ గారి రుద్రమ దేవి థియేటర్లో చూసినపుడు మా తెలంగాణ ఆత్మని తెరకేక్కించినందుకు గుణశేఖర్ గారికి ట్విట్టర్లో అభినందిస్తే ,మా ఇంట్లో అల్లు అర్జున్ గోన గన్నా రెడ్డి ఫోటోని మా ఇంట్లో వాల్ పోస్టర్ గా ,మా ఫోన్లలో వాల్ పేపర్ గా పెట్టుకున్నాము. నైజాంలో కలెక్షన్స్ వస్తే సినిమా ప్రొడ్యూసర్ సేఫ్ సైడ్ ఉంటాడని తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక వెన్నుముకల నిలచాము.

కానీ 5 రోజులుగా మాత్రం నాకు విపిరీతమైన ఆసంతృప్తి ,బాద కల్గిస్తున్నాయి. ఎందుకంటే 1980 వదశకంలో కోనసీమ తూఫాన్ వస్తే ఎన్టీఆర్ జోల పట్టుకొని విరాళాలు సేకరించాడని ,కృష్ణంరాజు,కృష్ణలు భారీగా విరాళాలు ఇచ్చారని మా నాన్న చెపుతుంటాడు. మొన్నటికి మొన్న హుదుద్ తూఫానుకి పవన్ కళ్యాణ్ ,మహేష్,రామ్ చరణ్,ఎన్టీఆర్,ప్రభాస్,అల్లు అర్జున్ లు భారీ విరాళాలు ఇచ్చారు. మేము సైతం అంటు ఒక ప్రపంచంలోని పెద్ద ఫంక్షన్ పెట్టి తెలుగు నటులు తమ ప్రతిభని ప్రదర్శించి అతి పెద్ద విరాళాలు ఇచ్చారు. దానికి తెలంగాణ సమాజం కూడా సాటి తెలుగువాడిగా స్పందించి మంచి సేవలు అందించారు. ఎందుకంటే వైజాగ్ అంటే తెలుగు వాళ్లకు చాల ఇష్టం. ఇక నిన్నటికి నిన్న చెన్నయ్ లో అతి పెద్ద వరదలు వచ్చి నెల రోజులపాటు జనజీవనం ఆగిపోయింది. దానికి ప్రపంచం మొత్తం స్పందించి చెన్నయ్ కి బాసటగా నిలిచింది. టాలీవుడ్ కూడా బాగా స్పందించింది. మెగా పవర్ రామ్ చరణ్ ఐఫా అవార్డు ఫంక్షన్ తన స్టెప్పులతో అలరించి వచ్చిన ఆదాయాన్ని చెన్నయి బాధితులకు అందించాడు. ఈ విషయం తెలుసుకున్న మేము చాల సంతోషించాము ఎందుకంటే మనం అభిమానించే వ్యక్తి ఒక గొప్ప కార్యక్రమం చేస్తే అది ఎవరికైనా గర్వించే విషయం. ఇలా చెన్నై బాధితులకు టాలీవుడ్ లో అందరు ఉడతా సహాయం చేశారు.

కానీ హైదరాబాద్ జనాలు చూసే డబ్బులతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ని దేశంలో మూడవ అతిపెద్ద సినిమా పరిశ్రమగా మార్చిన హైదరాబాద్ వాసులకు గత 60 ఏళ్లుగా ఎన్నో సమస్యలు వచ్చాయి. గత కొన్నేళ్లుగా తెలంగాణ కి కరువు సమస్య వస్తే ఒక్క టాలీవుడ్ నటుడు కూడా ఒక చిన్న చారిటి క్రికెట్ మ్యాచ్ పెట్టలేదు,నిజామాబాదు జిల్లాలో ఏడాదికి వేల మంది గల్ఫ్ బాధితులు దిక్కు తోచని స్థితిలో ఉండి చనిపోతే ఒక్క హీరో కూడా ముందుకురాలేదు. సరే ఇవన్నీ హైదరాబాద్ కాని తెలంగాణ సమస్యలు. ఒకవేళ మీ దృష్టికి రాలేకపోవచ్చు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలోని సమస్యలను మీ pro లు అందచేయకపోవచ్చు. కానీ గత 5 రోజులుగా హైదరాబాద్ మొత్తం వరదల్లో మునిగిపోతుంటే కూడా ఒక్క టాలీవుడ్ నటుడు కూడా స్పందించపోయేసరికి నా సమయాన్ని,నా డబ్బుని ఎందుకు సినిమాలు చూసి వృధా చేసుకున్నాను అని ఒక ఆలోచనలో పడ్డాను. ఎక్కడో చెన్నయ్ లో వరదలు వస్తే మీరు చేసిన సాయం ఇక్కడ అంత గొప్ప సాయం చేయమని నేను అడగటం లేదు.కనీసం మీరు ఒక పిలుపు ఇస్తే మీ లక్షల్లో ఉన్న అభిమానగణం చిటికెలో రంగంలోకి దిగుతారు. మేము సైతం అంటూ ప్రోగ్రాములు చేసి డాన్సులు కోరుకోవటం లేదు. మీ ట్విట్టర్ అకౌంట్ నుంచి 120 పదాల సందేశం చాలు అనుకుంటున్నాము.

ఈ అభ్యర్ధన ఎందుకంటే నాలో రెండు స్వార్థమైన విషయాలు ఉన్నాయి కాబట్టి.
1) ప్రపంచంలో గొప్ప సంస్కృతి ఉన్న హైదరాబాద్ నగర ఇమేజీని కాపాడుకోవాలని, ఎందుకంటే నగర ఇమేజ్ బాగుంటే నా software జాబ్ ఉంటుంది కాబట్టి.
2) ఇపుడు మీరు ముందుకొచ్చి తెలంగాణ సమాజాన్ని కాపాడితే సినీ భాషలోని నైజాం ఏరియా ని కాపాడుకోగల్గుతారు. ఎందుకంటే మాకు పొట్ట నిండితేనే సినిమాలు చూస్తాం కాబట్టి. ఒకవేళ మీరు హైదరాబాద్ ని కాపాడుకోకపోతే మాకు మీ మీద అభిమాన అసలు చావదు ఎందుకంటే ఠాగూర్ సినిమాలో ప్రకాష్ రాజ్ చెప్పినట్లు ఒకసారి తెలుగోడు అభిమానం పెంచుకుంటే అది చనిపోయేవరకు చావదు అని. కానీ సినిమాలు చూడటానికి డబ్బులు ఉండవు. మళ్ళి మా తాత లాగ నాటకాలు కాకపోయినా యూట్యూబ్ ఎవరో ఒకరు ఎపుడు ఒకపుడో పెడుతారు,టివిలో ఎపుడో ఒకసారి సినిమా వస్తుంది కాబట్టి అపుడు సినిమాలు మీ సినిమాలు చూస్తూ,మా తెలంగాణ చేకోడీలు తింటూ కాగితాలు చింపుకుంటాం.
ఇట్లు,
ఉభయ రాష్ట్రాల కుశలోపారి
ఓ తెలంగాణ సామాన్య software కుర్రాడు

Like fb page

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here