హై కోర్ట్ తీర్పును గౌరవించి పంచాయతీ ఎన్నికలను జరపాలి:దాసోజు

0
1400
కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిపాద‌న‌ల‌ను ప‌ట్టించుకోకుండా తెలంగాణ ప్ర‌బుత్వం పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు సిద్ద‌ప‌డింద‌ని, కాంగ్రెస్ ప్ర‌తిపాద‌న‌ల‌ను గౌర‌వించ‌క‌పోయినా క‌నీసం హైకోర్టు ఆదేశాలైనా పాటించి బి.సిల‌లో కులాల వారీగా జ‌నాభా లెక్క‌లు చేసి పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే బి.సిల‌లోని అన్ని ఉప కులాల‌కు రాజ‌కీయంగా న్యాయం జ‌రుగుతుంద‌ని ఈ విష‌యాన్నే తాము అన్ని ర‌కాలుగా ప్ర‌భుత్వానికి విన్న‌వించినా ప‌ట్టించుకోలేద‌ని చివ‌ర‌కు న్యాయ‌స్థాన్నాని సంప్ర‌దించాల్సి వ‌చ్చింద‌ని ఈ విష‌యంలో హైకోర్టు ఇచ్చిన మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులైనా గౌర‌వించాల‌ని టిపిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ముఖ్య అధికార ప్ర‌తినిధి డాక్ట‌ర్ శ్ర‌వ‌న్ దాసోజు అన్నారు. మంగ‌ళ‌వారం నాడు గాంధీభ‌వ‌న్ లో ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను స్వాగ‌తిస్తూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 
 
ప్ర‌బుత్వం బి.సి జ‌నాభా లెక్క‌ల‌ల‌ను ఒక్కో ద‌గ్గ‌ర ఒక్కో ర‌కంగా ప్ర‌క‌టించింద‌ని, లోప‌భూయిష్టంగా లెక్క‌లుండ‌డం వ‌ల్ల బి.సిల‌కు రాజ‌కీయంగా అన్యాయం జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. 2014లో తెలంగాణ రాగానే ప్ర‌భుత్వం చేప‌ట్టిన సమ‌గ్ర కుటుంబ స‌ర్వేలో తెలంగాణ‌లో 52 శాతం జ‌నాభా ఉన్న‌ట్టు ప్ర‌క‌టించింద‌ని, అంతేకాకుండా తెలంగాణ ప్ర‌భుత్వం శాస‌న‌స‌భ‌లో ముస్లీం రిజ‌ర్వేష‌న్ల బిల్లు విష‌యంలో బి.సిలు 37 శాతంగా పేర్కొన్నార‌ని, పంచాయ‌తీ బిల్లు చ‌ట్టంలో 34 శాతంగా పేర్కొన్నార‌ని  మ‌రి ఏది నిజ‌మో ప్ర‌భుత్వ‌మే చెప్పాల‌ని ఆయ‌న అన్నారు. ఈ ర‌కంగా ప్ర‌భుత్వం ఒక్కొ ద‌గ్గ‌ర ఒక్కొ విధంగా లెక్క‌లు పేర్కొన‌డం ఏమిట‌ని, జ‌నాభా ప్రాతిప‌దిక‌న వాటా కేటాయించాల‌ని అప్పుడే బి.సిల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని ఆయ‌న వివ‌రించారు. 
 
ప్ర‌బుత్వం ఒక‌వైపు బి.సి రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ఎబిసిడిఇ విభ‌జ‌న చేసి ఎన్నిక‌ల‌కు పోతామ‌ని ప‌త్రికా మాధ్య‌మాల‌కు లీకులు ఇస్తుంద‌ని మ‌రోవైపు హైకోర్టు ఆదేశించినా కూడా కౌంట‌ర్ అఫ‌డివిట్ వేయ‌కుండా నిర్ల‌క్ష్యం చేస్తుంద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌భుత్వానికి బి.సిల‌లో కుల గ‌ణ‌న చేయాలంటే పెద్ద క‌ష్టం కాద‌ని, గ‌తంలో ఒక్క రోజులో 4 కోట్ల జ‌న‌భా ఉన్న తెలంగాణ‌లో స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే చేశామ‌ని చెప్ప‌కున్నార‌ని, ప‌క‌డ్బందీగా కోటికి పైగా ఉన్న స‌ర్వే నెంబ‌ర్ల‌ను రెవిన్యూ భూ ప్ర‌క్షాళ‌న చేశామ‌ని గొప్ప‌లు చెప్ప‌కున్నార‌ని అంత గొప్ప‌గా ఉన్నామ‌ని చెప్ప‌కుంటున్న ప్ర‌భుత్వానికి చిత్తశుద్ది ఉంటే బి.సి కులాల గ‌ణ‌న పెద్ద‌గా క‌ష్ట‌మైన ప‌ని కాద‌ని, క‌ర్ణాట‌క మాదిరిగా అక్క‌డ 190 బిసి కులాలుంటే రెండు వ‌ర్గాలుగా ఎ.బి వ‌ర్గీక‌ర‌ణ చేసి ఎ.కు 80 శాతం బి.కు 20 శాతం వాటా ఇచ్చి ఎన్నిక‌లు నిర్వ‌హించార‌ని అక్క‌డి మాదిరిగానే ఇక్క‌డ కూడా చేయ‌వ‌చ్చున‌ని అన్నారు.  బి.సిల విష‌య‌మై ప్ర‌బుత్వం నిర్ల‌క్ష్యం చేస్తే టిఆర్ ఎస్‌ను బి.సి వ్య‌తిరేకంగా గుర్తించాల్సి ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. 
 
బి.సిల‌కు రాజ‌కీయంగా స్థానికి సంస్థ‌లు మొద‌టి మెట్టు అని వారు స‌ర్పంచ్‌లుగా, ఎం.పిటిసిలుగా, జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్లుగా ఎదిగితే రాబోయే రోజుల్లో వారికి రాజ‌కీయంగా మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని, 119 మంది ఎం.ఎల్‌.ఎలు ఉంటే కేవ‌లం 20 మంది బి.సిలు మాత్ర‌మే ఎం.ఎల్‌.ఎలుగా ఉన్నార‌ని అటు రాజ్యంగ ర‌క్ష‌ణ లేక ఇటు ఆధిప‌త్య కులాల అండ లేక బి.సిలు క‌ట్టు బానిస‌లుగా వోట్లు వేసే యంత్రాలుగా మారుతున్నార‌ని, ఇప్ప‌టికీ దాదాపు వంద కులాలకు క‌నీస రాజ‌కీయ ప్రాతినిధ్యం లేక అణ‌చివేత‌కు గుర‌వుతున్నార‌ని ఆయ‌న ఆవేధ‌న వ్యక్తం చేశారు.   కొత్త‌గా ఏర్ప‌డ్డ తెలంగాణ రాష్ట్రంలో మొట్ట‌మొది సారిగా జ‌రుగుతున్న ఈ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌లో నైనా సామాజిక న్యాయం జ‌ర‌గాల‌ని రాజ్యంగ సాధికారిత ల‌భించాల‌ని తాను కోర్టును ఆశ్ర‌యించాన‌ని ఆయ‌న వివ‌రించారు. 
 
ఈ విష‌యంలో  బి.సి స‌బ్బండ కులాలు ఐక్యంగా పోరాడాల‌ని ఆయన పిలుపునిచ్చారు. బిసిలకు గొర్రెలు, బ‌ర్రెలు, చేప‌లు, మంగ‌లి క‌త్తులు, చాక‌లి బండ‌లు, ఇస్తిరి పెట్టేలు వ‌ద్ద‌ని వారికి రాజ‌కీయ అధికారం కావాల‌ని, మా జ‌నాభా ఎంతో మాకు అంత వాటా కావాల‌నే డిమాండ్‌తోనే బిసిలు పోరాడి సాధించుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. 
కోర్టుకు పోయారు కాబ‌ట్టి ఎన్నిక‌ల‌ను ఆపి ఆ నింద‌ను బి.సిల‌పై వేసే కుట్ర‌ల‌కు ప్ర‌బుత్వం పాల్ప‌డ‌వ‌ద్ద‌ని వెంట‌నే స్పందించి బి.సి కుల గ‌ణ‌న చేసి వ‌ర్గీక‌ర‌ణ విభ‌జించి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here